కొడిమ్యాల: పండుగ పూట సందడి నిండాల్సిన ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. ఇంటిముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బ్లేడ్ ట్రాక్టర్‌పై నుంచి పడి బాలుడు మృతిచెందిన ఘటన కొడిమ్యాల మండలం కొండాపూర్ పరిధి బొల్లంచెరువు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బొల్లంచెరువుకు చెందిన చెల్లా శేఖర్ దంపతులకు రుషికుమార్ (6) కుమారుడు ఉన్నాడు. రుషికుమార్ ఆదివారం ఉదయం ఇంటి ముందు ఉన్న ఫ్రంట్బ్లేడ్ ట్రాక్టర్‌పై ఎక్కి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి బ్లేడ్ రాడ్‌పై పడిపోయాడు. తల, ముక్కుకు తీవ్ర గాయాలు కావడతంఓ బాలుడు స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే సీపీఆర్ చేసి.. ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇంట్లో చిన్నారి సందడితో కళకళలాడాల్సిన వేళ ప్రమాదం చోటుచేసుకుని కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగిల్చింది. పండుగ సమయంలో జరిగిన ఈ విషాదంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి చెల్లా శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


