హసన్‌పర్తి: ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుడు అదృశ్యమయ్యాడు. ఈమేరకు ఆయన భార్య హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ శాంతినగర్‌కాలనీకి చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ పున్నం రమేశ్‌బాబు భార్య కల్పన (న్యాయవాది)తో కలిసి హసన్‌పర్తి మండల కేంద్రంలోని కాకతీయ వెంటేజ్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం డాక్టర్ రమేశ్ హుజూరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పతిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అలాగే, పరకాలలో సూర్య డయాగ్నొస్టిక్ సెంటర్లో రేడియాలజిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటీవల పరకాలలోని డయాగ్నొస్టిక్ సెంటర్ వద్ద అప్పులు ఇచ్చిన వారితో గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 17న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన రమేశ్ తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రమేశ్‌బాబు గురించి వివిధ ప్రాంతాల్లో వాకబు చేశారు. ఆచూకీ కానరాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.


