సర్కారు ధాన్యం పక్కదారి | - | Sakshi
Sakshi News home page

సర్కారు ధాన్యం పక్కదారి

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

● కోర్కల్‌ రైస్‌ మిల్లుపై కేసు ● 12,914 క్వింటాళ్ల ధాన్యం ఎగవేత ● రూ.4.16కోట్ల ధాన్యం పక్కదారి

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/వీణవంక:

వీణవంక మండలం కోర్కల్‌ గ్రామంలోని వాసవీ ఎంటర్‌ప్రైజెస్‌, నాగార్జున రైస్‌ ఇండస్ట్రీస్‌లో సీఎంఆర్‌ కోసం అప్పగించిన ధాన్యం మాయం కావడంపై జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ రజనీకాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. 2023–24 ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వ ధాన్యాన్ని కస్టం మిల్లింగ్‌ కోసం కేటాయించగా ప్రభుత్వానికి తిరిగి మిల్లర్‌ బియ్యం ఇవ్వలేదు. దీంతో రంగంలోకి దిగిన సివిల్‌ సప్లయ్‌ అధికారులు జూలై 13న నిర్వహించిన తనిఖీల్లో ధాన్యం, బియ్యం నిల్వలు లేవని నిర్ధారించారు. దీంతో గత నెల 29న మిల్లరు నార్ల వెంకటేశ్వర్లుపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

ధాన్యం పక్కదారి

2023– 24 ఖరీఫ్‌ సీజన్‌లో సంబంధిత మిల్లుకు 13,342.40క్వింటాళ్ల ధాన్యాన్ని అధికారులు కేటాయించారు. ఒప్పందం ప్రకారం 8,939.41క్వింటాళ్ల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా 286.48 క్వింటాళ్లు మాత్రమే అందించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా 12,914.83 క్వింటాళ్లు కొరత ఉన్నట్లు అధికారుల గుర్తించారు. ధాన్యం కొరతకు సంబంధించి 25శాతం జరిమానాతో రూ.4,16,83,097ల చెల్లించాల్సి ఉందని, పలుమార్లు నోటీసులు పంపినా మిల్లర్‌ స్పందించకపోవడంతో ఫిర్యాదు చేశామని అధికారులు పేర్కొన్నారు.

పోలీసుల విచారణపై ఆసక్తి

గత నెల 29న సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇప్పటి వరకు పోలీసులు విచారణ జరిపారా లేదా తెలియరాలేదు. ప్రభుత్వ ధాన్యం నిల్వల్లో భారీగా కొరత ఏర్పడడానికి కారణాలేమిటి? ధాన్యం ఎక్కడికి వెళ్లింది. ఈ వ్యవహారంలో మిల్లర్‌తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నరా? అనే అంశాలపై పోలీసులు విచారించాల్సి ఉంది. ఇన్ని రోజులు సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికై న పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై సివిల్‌ సప్‌లై అధికారి వినోద్‌ను వివరణ కోరగా ప్రభుత్వం అప్పగించిన ధాన్యం కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశామని తెలిపారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా మిల్లర్‌ స్పందించలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement