కోనరావుపేట(వేములవాడ): విధుల నుంచి తొలగించారని గ్రామపంచాయతీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన పురుసాని దేవరాజు 20 ఏళ్లుగా గ్రామపంచాయతీలో సపాయి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నెల రోజుల క్రితం దేవరాజును తొలగించి వేరే వ్యక్తిని నియమించుకున్నారు. అప్పటి నుంచి తననే పనిలో పెట్టుకోవాలని గ్రామపంచాయతీ చుట్టూ తిరుగుతున్నాడు. ఇటీవల జరిగిన గ్రామసభలో పాలకులను బతిమిలాడినా వారు కనికరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన దేవరాజు మంగళవారం గడ్డిమందు తాగాడు. వెంటనే కుటుంబసభ్యులు సిరిసిల్లలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దేవరాజును సర్పంచ్ మల్యాల స్వామి పరామర్శించి మాట్లాడారు. సమాచారం ఇవ్వకుండా వేరే ఊరికి వెళ్లాడని, దేవరాజు కుటుంబసభ్యుల ఆమోదంతోనే వేరే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నామన్నారు.


