కరీంనగర్ అర్బన్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కురుస్తున్న మోస్తారు వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నా యి. తొలకరి నుంచి వర్షం దోబూచులాడుతుండగా కర్షకులు మొగులు వైపు చూస్తూ పడిగాపులు కాశా రు. తేలికపాటి వానలతో పత్తి విత్తనాలు వేయగా డ్రైస్పెల్(ఎక్కువ రోజులు వర్ష విరామం) ఆందోళన నెలకొంది. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావంతో పత్తి మొక్కలు వాడిపోగా కొన్నిచోట్ల రెండోసారి విత్తనాలు వేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షం మొక్కలకు ప్రాణం పోస్తోంది. పత్తిరైతుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా వరి నార్లు పోసుకున్నవారికి ఇంకా నిరీక్షణే ఎదురవు తోంది. ఈ నెలాఖరు వరకు నాట్లు వేసుకునే అవకాశముండగా ఆ లోపైనా భారీ వర్షం పడకపోతుందా అన్న ఆశాభావంతో మడులు సిద్ధం చేస్తున్నారు.
పత్తి, మొక్కజొన్నకు ప్రయోజనం
ఏటా రైతులు వానాకాలం సీజన్ ప్రారంభంలోనే విత్తనాలు వేశారు. ఈ సారి ఆశించినస్థాయిలో వర్షాలు లేకపోగా అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేశా యి. దుక్కిలోనే విత్తనాలు వేసిన రైతులకు ఆశించిన స్థాయిలో వర్షాలు లేక విత్తనాలు నేలలోనే మా డిపోవడం, మొక్కలు ఎండిపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. చాలా చోట్ల రెండోసారి విత్తనాలు వేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో గ్రామాల్లో వర్షాల కోసం కప్పతల్లి ఆటలు, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో పత్తి ఎదుగుదల ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉంది. ముందుగా సాగు చేసిన పంట పూతదశకు చేరగా.. మరికొన్ని ప్రాంతాల్లో మొలకదశలో ఉంది. వర్షాభావంతో ఆకులు వాలి ఎండిపోతున్న సమయంలో కురిసిన వర్షం మొక్కలకు ఊపిరి పోసింది.
అంతటా లోటు వర్షపాతమే.
జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 362 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదుకావా ల్సి ఉండగా 218.7 మి.మీ. మాత్రమే నమోదైంది. కరీంనగర్ అర్బన్‌తో పాటు కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గంగాధర, చొప్పదండి, రామడుగు, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక, సైదాపూర్, చిగురుమామిడి, ఇల్లందకుంట ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది.
నాట్లు పడేనా.. బీళ్లుగానే పొలాలు
ఎల్‌నినో వరిసాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సీజన్‌లో 2.75లక్షల ఎకరాల్లో వరి సాగు కావా ల్సి ఉండగా ఇంకా నార్లు పోసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం 15వేల ఎకరాల్లో నే వరి సాగైనట్లు తెలుస్తోంది. అదికూడ బోర్లు, బావు ల కింద మాత్రమే సాగయ్యాయి. ఎక్కువగా హు జూరాబాద్, జమ్మికుంట, చిగురుమామిడి, మానకొండూరు, ఽశంకరపట్నం, తిమ్మాపూర్, వీణవంక, సైదాపూర్ ప్రాంతాల్లో అత్యధిక శాతం వరి సాగు చేస్తుంటారు. ఏ మండలంలోనూ 10శాతం నాట్లు పడలేదని రైతులు వాపోతున్నారు. పత్తి విత్తనాలు వేసే గడువు ముగియగా, బోరుబావుల ఆధారంగా వరి వేయాలని మడులు సిద్ధం చేశారు. ఎండవేడిమి, ఉక్కపోతతో నారుమళ్లపై మొగిపురుగు ప్రభా వం చూపి, వరి సాగు సందిగ్ధంలో పడింది.
ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. పైగా వాణిజ్య పంటల సాగు గడువు ముగుస్తోంది. అందువల్ల పరిస్థితిని బట్టి రైతులు సాగు నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా అధిక నీటి అవసరం ఉన్నపంటల కన్నా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి. – మధూకర్, ప్రధాన శాస్త్రవేత్త,
తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం
జిల్లాలో మొత్తం చెరువులు: 1,376
0– 25 శాతం నీరున్న చెరువులు:691
25– 50శాతం నీరున్న చెరువులు:556
50– 75శాతం నీరున్న చెరువులు:118
75– 100శాతం నీరున్న చెరువులు:11


