ఎన్నాళ్లకెన్నాళ్లకు! | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు!

Jul 23 2026 2:18 AM | Updated on Jul 23 2026 2:18 AM

గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లో ఎన్నికల సందడి

విడుదలైన నోటిఫికేసన్‌.. 27నుంచి 29వరకు నామినేషన్ల స్వీకరణ

30న పరిశీలన.. 31న ఉపసంహరణ, ఆగస్టు 5న పోలింగ్‌

కరీంనగర్‌ అర్బన్‌: సుదీర్ఘ నిరీక్షణ, దాదాపు 15ఏళ్ల అనంతరం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడింది. బుధవారం నోటిఫికేషన్‌ వెలువరించగా అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, ఎన్నికల అధికారి మహమ్మద్‌ జలాలు ద్దీన్‌ అక్బర్‌ నోటిఫికేషన్‌ ప్రతులను జిల్లా పశుసంవర్ధఽకశాఖ అధికారి డా.నల్ల లింగారెడ్డికి అందజేశారు. ఇప్పటివరకు సంఘాల బాధ్యులుగా కొనసాగుతున్న వారిస్థానంలో పశుసంవర్థక శాఖ అధికారులే పర్సన్‌ ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్న విషయం విదితమే. వారి ద్వారానే సంఘాల ఓటర్ల జాబితాల్లో అవసరమైన సవరణలు చేయించారు.

ఆగస్టు 5న పోలింగ్‌.. అదే రోజు ఫలితం

జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్‌ ఎన్నికలకు ప్రకటన వెలువడగా ఆశావాహుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ నెల 27నుంచి 29వరకు నామినేషన్లను స్వీకరించనుండగా 30న నామినేషన్ల పరిశీలన, 31న ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారి జలాలుద్దీన్‌ అక్బర్‌ వివరించారు. ఆగస్టు 5న రహస్య బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ జరగనుంది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్‌, 3.30గంటలకు కౌంటింగ్‌, సాయంత్రం వరకు ఫలితాలను ప్రకటించనున్నారు.

12మంది డైరెక్టర్ల ఎన్నికకు పోలింగ్‌

యూనియన్‌లో 12మంది డైరెక్టర్లను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. దాదాపు 15ఏళ్ల అనంతరం ఎన్నికలు జరుగుతుండటంతో పోటీ తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. డైరెక్టర్లుగా గెలిచినవారంతా ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. 6 లేదా 7న ప్రమాణస్వీకారం ఉండనుంది.

243కు 139 సంఘాల అధ్యక్షులకే అవకాశం

జిల్లాలో మొత్తం 243 సంఽఘాలుండగా 139 సంఘాలకే ఓటు అవకాశం లభించింది. సభ్యత్వం తీసుకుని ఎన్నికలు నిర్వహించడం ఆయా గ్రామాల్లో జరగాల్సిన ప్రక్రియ కానీ చాలా సంఘాలు ఎన్నికల నిర్వహణలో జాప్యం చేశాయి. దీంతో 2024 ఆగస్టు వరకు ఎన్నికలు జరిగిన సంఘాలకు మాత్రమే ఓటింగ్‌ అవకాశం కల్పించారు. తదుపరి ఎన్నికలు జరిగిన సంఘాలకు ఓటేసే అవకాశం లేదు. కాగా ఎన్నికల్లో 139 సంఘాల అధ్యక్షులు మాత్రమే ఓటు వేయనున్నారు. మిగతా 104 సంఘాలు ఓటుకు దూరమే.

పదిహేనేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలన

పదిహేనేళ్ల క్రితం సంఘాలకు ఎన్నికలు జరగగా రాష్ట్రం ఏర్పడిన నుంచి ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఫలితంగా సంఘాల అభివృద్ధి మందగించింది. గతంలో జాతీయ సహకార అభివృద్ధి పథకం ద్వారా పావలా వడ్డీ కింద రూ.7కోట్లు రుణాలిచ్చారు. ఏటా 25శాతం చొప్పున రుణం తీర్చేయాలి. కానీ సంఘాలకు పాలకవర్గాలు లేకపోవడంతో రుణాల రికవరీలో పురోగతి లేదు. ఈ ఎన్నికల్లో పూర్తి అధిపత్యం సాధించేందుకు అధికార పార్టీ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement