రోడ్లపై నీరుండొద్దు | - | Sakshi
Sakshi News home page

రోడ్లపై నీరుండొద్దు

Jul 23 2026 2:18 AM | Updated on Jul 23 2026 2:18 AM

● ప్రమాదాలు జరిగే చోట హెచ్చరిక బోర్డులు తప్పనిసరి ● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సీపీ గౌస్‌ఆలంతో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించి, అక్కడ స్పీడ్‌ బ్రేకర్లు, రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు, రోడ్డు మార్కింగ్‌లు ఏర్పాటు చేయాలని సూ చించారు. మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, కల్వ ర్టులకు పసుపు రంగు వేయించి హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలన్నారు. నగరపాలక పరిధిలో ప్రధాన రహదారులపై లైటింగ్‌ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. స్పీడ్‌ డిటెక్టర్లు, కెమెరాలు, సైన్‌ బోర్డులు, ఎమర్జెన్సీ కాల్‌ బాక్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తం 60 రోజుల్లో పూర్తి కావాలన్నారు. 15 రోజులకు ఒకసారి రవాణా, పోలీస్‌, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు సమావేశమై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం మాట్లాడుతూ అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, వాహనదారులు హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడంతోనే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

త్వరితగతిన భూసేకరణ పనులు

జిల్లాలో చేపట్టిన కీలక సాగునీటి, రైల్వే, రహదారి అభివద్ధి ప్రాజెక్టుల భూసేకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా రెవెన్యూ, ఇరిగేషన్‌తో పాటు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలని స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రెవెన్యూ, ఇరిగేషన్‌, భూ సేకరణ విభాగం, నేషనల్‌ హైవేస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌– జగిత్యాల ఫోర్‌లేన్‌ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పురోగతిపై ఆరా తీశారు. కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ భూసేకరణ, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల (ఆర్‌ఓబీలు) నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాసం (ఆర్‌ అండ్‌ ఆర్‌) వంటి అంశాలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.

మాదక ద్రవ్యాల నిర్మూలనకు భాగస్వాములు కావాలి

కరీంనగర్‌క్రైం: మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి నార్కోటిక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాల వారీగా నమోదైన కేసులను సమీక్షిస్తూ నెలవారీ, వార్షిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సీపీ గౌస్‌ఆలం మాట్లాడుతూ విద్యాసంస్థలు, దుకాణాల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డీఈవో చైతన్య జైనీ మాట్లాడుతూ పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నిరోధక క్లబ్బులు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు చేపడతామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement