డిష్యుం.. డిష్యుం | - | Sakshi
Sakshi News home page

డిష్యుం.. డిష్యుం

Jul 23 2026 2:18 AM | Updated on Jul 23 2026 2:18 AM

నగరంలో కాంగ్రెస్‌, బీజేపీ బాహాబాహీ

ఉద్రిక్తంగా బండి సంజయ్‌ కార్యాలయ ముట్టడి

కాంగ్రెస్‌ నాయకులపై కర్రలతో దాడి చేసిన బీజేపీ

చెప్పులు, కుర్చీలు విసురుకున్న ఇరువర్గాలు

లాఠీచార్జ్‌ చేసి చెదరగొట్టిన పోలీసులు

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌: కాంగ్రెస్‌ నగరంలో చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీ ఊహించని విధంగా కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్‌ కార్యాలయం ముట్ట డికి మళ్లడంతో కాంగ్రెస్‌, బీజేపీలు బాహాబాహీకి తలపడ్డాయి. కార్యాలయంలో ఉన్న బీజేపీ నాయకులు కర్రలతో కాంగ్రెస్‌ నాయకులపై దాడికి పాల్పడగా, ఇరువర్గాలు చెప్పులు, కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు.

‘బండి’ కార్యాలయం ముట్టడి

ఢిల్లీలో రాహుల్‌గాంధీ అరెస్ట్‌, నీట్‌ పేపర్‌ లీక్‌కు నిరసగా బుధవారం నగరంలోని కార్ఖానగడ్డ మహా త్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ఆందోళన నిర్వహించింది. కోర్టు చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టింది. అకస్మాత్తుగా అక్కడి నుంచి సమీపంలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కార్యాలయం ముట్టడికి ర్యాలీ మళ్లింది. ఊహించని పరిణామంతో పోలీసులు ర్యాలీని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను అదుపులోకి తీసుకున్నారు. సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ,హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌ ఆధ్వర్యంలో నాయకులు ఎంపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కార్యాలయంలో ఉన్న బీజేపీ కార్పొరేటర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌రావు, ఉప్పరపల్లి శ్రీను, గుజ్జ శ్రీనివా స, పుప్పాల రఘు, దుర్శేటి సంపత్‌ కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. పోలీసులు గేట్‌ వేసినప్పటికీ రెండు పార్టీల నాయకులు ఘర్షణపడ్డారు. గేట్‌పైనుంచే బీజేపీ నాయకులు కర్రలతో కాంగ్రెస్‌ నాయకులపై దాడి చేశారు. ప్రతిగా కాంగ్రెస్‌ నాయకులు చెప్పులు విసిరారు. ఇరువర్గాలు చెప్పులు, కుర్చీలు విసురుకున్నారు. పీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, ఏఎంసీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య తదితరులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. మునిగంటి అనిల్‌ తదితరులు దాడిలో గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేసి కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సీపీ గౌస్‌ ఆలం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

డీసీసీ కార్యాలయం వద్ద బందోబస్తు

కాంగ్రెస్‌ ముట్టడి, ఘర్షణ సమాచారంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మేయర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌రావు, కార్యకర్తలు ఎంపీ కార్యాలయానికి చేరుకొన్నారు. కాంగ్రెస్‌ తీరును తీవ్రంగా ఖండించారు. ప్రతిగా డీసీసీ కార్యాలయం ముట్టడికి బీజేపీ నాయకులు వెళ్తారనే ప్రచారంతో పోలీసులు డీసీసీ ఆఫీస్‌ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement