టీజీ–20 లీగ్‌లో మనోళ్లు | - | Sakshi
Sakshi News home page

టీజీ–20 లీగ్‌లో మనోళ్లు

Jun 8 2026 11:36 PM | Updated on Jun 8 2026 11:36 PM

వేలంలో మెరిసిన ఉమ్మడి జిల్లా కుర్రాళ్లు

అంతర్జాతీయ స్టార్స్‌ తిలక్‌వర్మ, సిరాజ్‌తో ఆడనున్న మన క్రికెటర్లు

అత్యధికంగా రూ. 12 లక్షలు పలికిన అమన్‌రావు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: తెలంగాణ క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి వేదికవుతున్న టీజీ–20 లీగ్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అరుదైన స్థానాలను దక్కించుకున్నారు. త్వరలో ఉప్పల్‌ స్టేడియంలో ప్రారంభం కానున్న మెగా లీగ్‌.. భారత క్రికెట్‌ స్టార్స్‌ తిలక్‌వర్మ, మొహమ్మద్‌ సిరాజ్‌ల ఉనికితో సరికొత్త గ్లామర్‌ను సంతరించుకుంది. ఇలాంటి హేమాహేమీలు ఆడుతున్న ప్రతిష్టాత్మక లీగ్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆరుగురు యువ క్రికెటర్లు వివిధ ఫ్రాంచైజీలకు ఎంపికవడం జిల్లా క్రికెట్‌ ఖ్యాతికి నిదర్శనం.

గ్రామీణ క్రీడాకారులకు సరికొత్త ఆశాకిరణం

కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల వంటి ప్రాంతాల నుంచి వచ్చిన ఈ క్రీడాకారులు కేవలం లీగ్‌కు మాత్రమే ఎంపిక కాలేదు. వేలాది మంది గ్రామీణ ప్రాంత యువకులకు సరికొత్త నమ్మకాన్ని ఇచ్చారు. టీజీ–20 లీగ్‌ కల్పించిన ఈ వేదిక ద్వారా కుర్రాళ్ల జీవితాలు ఆర్థికంగా, వృత్తిపరంగా సరికొత్త మలుపు తిరగనున్నాయి. లీగ్‌లో అద్భుతంగా రాణించి, జాతీయ స్థాయి ఐపీఎల్‌ రేసులోకి కూడా దూసుకెళ్లాలని, కరీంనగర్‌ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement