బ్రెయిన్‌ ట్యూమర్‌.. డోంట్‌ ఫియర్‌ | - | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ ట్యూమర్‌.. డోంట్‌ ఫియర్‌

Jun 7 2026 11:51 PM | Updated on Jun 7 2026 11:51 PM

ప్రధాన లక్షణాలు ఇవే

ట్యూమర్‌కు భయపడవద్దు...

కణాల అసాధారణ పెరుగుదలే ట్యూమర్‌...

బ్రెయిన్‌ ట్యూమర్‌ అనేది మెదడులో లేదా దాని చుట్టుపక్కల భాగాల్లో కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరగడం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్య. ఇది నిరపాయమైన లేదా ప్రాణాంతకమైన రూపంలో ఉండొచ్చు. ఏ రూపమైనా మెదడు పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ట్యూమర్‌ ఎక్కడ ఏర్పడిందో దాని ఆధారంగా లక్షణాలు మారుతాయి. కొన్ని సందర్భాల్లో చాలా నెమ్మదిగా లక్షణాలు కనిపిస్తే, మరికొన్ని సందర్భాల్లో సమస్యలు తీవ్రమవుతాయి.

న్యూరో లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు...

మెదడు సంబంధిత వ్యాధుల్లో సమయం అత్యంత కీలకం. ప్రారంభ దశలో గుర్తిస్తే శస్త్రచికిత్స, రేడియేషన్‌ లేదా ఇతర ఆధునిక చికిత్సల ద్వారా మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. ఆలస్యమయితే చికిత్స క్లిష్టమవడంతో పాటు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సాధారణ తలనొప్పి అనుకుని నెలల తరబడి మందులు వాడుతూ ఉండటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూర్చలు, చూపు సమస్యలు లేదా చేతులు– కాళ్ల బలహీనత వంటి లక్షణాలు కలిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

అందుబాటులో ఆధునిక వైద్యం

వైద్య సాంకేతికత వల్ల బ్రెయిన్‌ ట్యూమర్‌ నిర్ధారణ, చికిత్సలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి ఆధునిక పరీక్షల ద్వారా ప్రారంభ దశలోనే ట్యూమర్‌ను గుర్తించవచ్చు. చికిత్సలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మైక్రో న్యూరోసర్జరీ, న్యూరో నావిగేషన్‌ టెక్నాలజీ, ఆధునిక రేడియేషన్‌ థెరపీ వంటి విధానాలతో ప్రమాదాన్ని తగ్గిస్తూ చికిత్స అందించడం సాధ్యమవుతోంది. రోగులు సురక్షితంగా, వేగంగా కోలుకునే అవకాశం ఉంది.

తరచూ తలనొప్పి, మూర్చను నిర్లక్ష్యం చేయొద్దు

ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేయడం సాధ్యం

నేడు ‘ప్రపంచ బ్రెయిన్‌ ట్యూమర్‌ డే’

బ్రెయిన్‌ ట్యూమర్‌ ప్రారంభ సంకేతాలు సాధారణ సమస్యలతో కలిపి కనిపించే అవకాశం ఉండటంతో చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ లక్షణాలు పదేపదే కనిపిస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

తరచూ లేదా తీవ్రమైన తలనొప్పి

ఉదయం వేళల్లో ఎక్కువగా వాంతులు రావడం మూర్ఛ రావడం

చూపు మందగించడం లేదా డబుల్‌ విజన్‌

మాటలు తడబడటం లేదా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది

జ్ఞాపకశక్తి తగ్గడం, ప్రవర్తనలో మార్పులు

నడకలో అసమతుల్యత, శరీరంలో ఒక వైపు బలహీనత

ఈ లక్షణాలు ఇతర సాధారణ వ్యాధుల్లో కూడా కనిపించవచ్చు. కానీ నిరంతరంగా లేదా తీవ్రంగా పెరుగుతూ ఉంటే మాత్రం వెంటనే న్యూరో వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.

కరీంనగర్‌: తరచూ తలనొప్పి వస్తోందా? కారణం లేకుండా వాంతులు అవుతున్నాయా? ఒక్కసారిగా మూర్చ రావడం, చూపు మందగించడం, మాట తడబడటం లేదా శరీరంలో ఒక వైపు బలహీనత కనిపిస్తోందా? వీటిని సాధారణ సమస్యలుగా తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పిని పనిఒత్తిడిగా... మతిమరుపును వయసు ప్రభావంగా.. కళ్లు తిరగడాన్ని అలసటగా.. తేలికగా తీసుకుంటాం... ఇవి కొన్ని సందర్భాల్లో బ్రెయిన్‌ ట్యూమర్‌ సంకేతాలు కావచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, రోగి జీవనప్రమాణం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. నేడు ప్రపంచ బ్రెయిన్‌ ట్యూమర్‌ డే.

బ్రెయిన్‌ట్యూమర్‌ అనగానే భయపడొద్దు. గతంలో ట్యూమర్‌వస్తే చనిపోతారనే భయం ఉండేది. ప్రస్తుతం ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. ప్రతి ట్యూమర్‌ కేన్సర్‌కాదు. ఆపరేషన్‌తో నయం అవుతుంది. అయితే బ్రెయిన్‌ ట్యూమర్‌ విషయంలో అవగాహన అత్యంత కీలకం. కుటుంబ సభ్యులు, సమాజం కలిసి ప్రారంభ లక్షణాలను గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకుంటే అనేక ప్రాణాలను కాపాడవచ్చు. ముఖ్యంగా పిల్లలు, యువత, వద్ధులు తరచూ తలనొప్పి లేదా మూర్చ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

– డాక్టర్‌ రాజీవ్‌రెడ్డి, న్యూరోసర్జన్‌

Advertisement
 
Advertisement
Advertisement