అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో రాజేశ్, స్వరూప అనే దంపతులు నివసించేవారు. వారికి ఒక కుమారుడు. అతని పేరు సోము. ఆ సోముకి చదవడమన్న, ఎదుటివారితో మాట్లాడడమన్న చాలా భయం. సోమును తన తోటి విద్యార్థులు, గ్రామస్తులు పిరికివాడు అనేవారు. కానీ అతనికి చాలా పెద్ద కోరిక ఉండేది. పెద్ద కంపెనీకి సీఈవో కావాలని ఆశ. కానీ తనకున్న భయంతో ఎవరితో తన కోరిక చెప్పలేకపోతాడు. సోమును ఎవరూ ప్రోత్సహించకపోవడంతో.. ఎవరూ పట్టించుకోకపోవడంతో తనపై తనకు ద్వేషం కలిగింది.
అలా ఉండగా ఒక రోజు సోమువాళ్ల లెక్కల మాస్టారు అతని తల్లిదండ్రులతో మాట్లాడుతాడు. సోము అసలు చదవడం లేదని, ఎవరితో కలిసి ఉండడని, ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడని చెపుతాడు. ఆ విషయం విని బాధపడిన తల్లిదండ్రులు సోముని చేరదీసి అసలు విషయం అడుగుతారు. దానికి సోము ఎవరితోనైనా మాట్లాడాలంటే తనకు చాలా భయమని చెప్తాడు. ఆ విషయాన్ని విన్న రాజేశ్.. బేటా భయపడటం ద్వారా మనం ఈ సమాజంలో బతకడం చాలా కష్టం. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా గొంతు విప్పి మాట్లాడుతావో అప్పుడే నీకు విలువ ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. అప్పుడే నీవు అనుకున్నది సాధించవచ్చు. అమాయకంగా ఉంటే నిన్ను పట్టించుకునే వాళ్లు ఎవరూ ఉండరు.. అని హితబోధ చేస్తాడు. తన తండ్రి మాటలతో ప్రభావితమైన సోము ఇక నుంచి నేను భయపడను. ధైర్యంగా ఉంటాను. బాగా చదువుకుంటాను అని అంటాడు.
ఆ తర్వాత రోజు నుంచి సోము క్రమంగా తన భయాన్ని పోగొట్టుకొని అందరితో మాట్లాడుతాడు. తరగతిలో చురుకుగా ఉండి బాగా చదువుతాడు. సోములో వచ్చిన మార్పును చూసి అతని మిత్రులందరూ ఆశ్చర్యపోతారు. అతనితో అందరూ స్నేహంగా ఉంటారు. దాంతో సోము బాగా చదువుకొని పెద్దయ్యాక తను అనుకున్న విధంగానే ఒక పెద్ద కంపెనికి సీఈవో అవుతాడు. కొడుకును ఉన్నత స్థానంలో చూసి ఎంతో సంతోషపడతారు రాజేశ్ దంపతులు.
టి.సుష్మ, పదోతరగతి
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల
చింతకుంట, కరీంనగర్(జిల్లా)


