● సమ్మర్ క్యాంపులతో వీర్నపల్లికి నూతనోత్సాహం ● ఫోన్లకు దూరంగా.. మైదానంలో చిరుతల్లా.. ● శిబిరంలో ఉత్సాహంగా చిన్నారులు
వీర్నపల్లి పాఠశాలలో సమ్మర్ క్యాంపులో విద్యార్థులు
వీర్నపల్లి(సిరిసిల్ల): కల్లోలిత ప్రాంతంగా ముద్రపడ్డ రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు పోలీసుల బూట్లచప్పుళ్లు.. నక్సలైట్ల పాటలతో మారుమోగిన అటవీ పల్లెల్లో క్రీడా కుసుమాలు విరబూస్తున్నాయి. వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘క్రికెట్ సమ్మర్ క్యాంపు’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సెల్‌ఫోన్లకే పరిమితమవుతున్న నేటితరం పిల్లలకు ఆటపాటల ద్వారా ఉజ్వల భవిష్యత్‌ను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోంది.
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆటలను అలవాటు చేస్తున్నాం
క్రికెట్ అంటే ఇష్టం
మెలకువలు నేర్పిస్తున్న సీనియర్లు
ఈ శిక్షణ శిబిరంలో సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు ముగ్గురు కోచ్‌లను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. గత నెల రోజులుగా పిల్లలకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెలకువలు నేర్పిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళ శిక్షణ ఇస్తున్నారు. క్రీడల్లో నైపుణ్యం పెంచడంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలను నూరిపోస్తున్నారు. క్రీడలే కాకుండా మత్తు పదార్థాలైన మద్యపానం, ధూమపానం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోచ్‌లు, సర్పంచ్ జ్యోత్స్న పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఫోన్లకు బ్రేక్.. గ్రౌండ్‌లో జోష్
వేసవి సెలవులొచ్చాయంటే చాలు.. పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని స్థానిక మేధావులు, పాలకవర్గం నిర్ణయానికొచ్చింది. సెలవుల్లో పిల్లలను ఫోన్ల నుంచి గ్రౌండ్ వైపు మళ్లించాలని సంకల్పించారు. ఇటీవల పలు చోట్ల పిల్లలు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వారిని కదిలించాయి. దీంతో పిల్లలకు రక్షణతో కూడిన ఉల్లాసాన్ని అందించేలా ఈ సమ్మర్ క్యాంపును ప్రారంభించారు.


