సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లి గ్రామానికి చెందిన పిల్లి శ్రీశైలం(29)అనే గొర్రెల కాపరి గురువారం సాయంత్రం వడదెబ్బతో మృతి చెందినట్లు ఎస్సై స్వాతి తెలిపారు. శ్రీశైలం శుక్రవారం ఎండలో గొర్రెలు కాస్తుండగా నీరసంగా ఉందని తండ్రి తిరుపతికి ఫోన్‌లో తెలిపాడు. ఇంటికి తీసుకురాగానే సొమ్మసిల్లిపోయాడు. చికిత్స కోసం 108కు ఫోన్ చేశారు. 108సిబ్బంది వచ్చి చూసి శ్రీశైలం అప్పటికే మృతి చెందాడని తెలిపారు. తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
లారీ ఢీకొని మహిళ..
వెల్గటూర్: లారీ ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చర్లపల్లి గ్రామానికి చెందిన మీసా మునిలత (34) పని నిమిత్తం రాజారాంపల్లి గ్రామానికి వెళ్లి వివేకానంద చౌరస్తా సమీపంలో రోడ్డు దాటుతుండగా జగిత్యాల నుంచి బసంత్‌నగర్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ కొమురయ్య అజాగ్రతగా, అతివేగంగా నడిపి మహిళ పై నుంచి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో మునిలత తీవ్రంగా గాయపడగా, అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు.
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): కూతుళ్ల పెళ్లిళ్లకు చే సిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపానికి గురైన ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన ఆవునూరి దేవానందం(60) గు రువారం రాత్రి పాలు పోసేందుకు పాలకేంద్రానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరకపోవడంతో భార్య భూదేవిక, కుమారుడు భానోదయ్ వెదికారు. అయినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం గ్రామశివారులోని వారి పొలంలో దేవానందం చెట్టు కు ఉరివేసుకుని కనిపించాడు. ఇటీవల ముగ్గురు కూతుళ్ల వివాహాలకు రూ.25లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
వెన్గుమట్లలో వృద్ధుడు..
గొల్లపల్లి: మండలంలోని వెన్గుమట్ల గ్రామానికి చెందిన ఐతేనేని పోచయ్య (70) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి తెలిపారు. నాలుగేళ్లుగా మానసిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోచయ్య శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో తన ఇంటి ముందున్న రేకుల షెడ్డుకు ఉరేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


