బాధను దిగమింగి వెలుగులు పంచారు | - | Sakshi
Sakshi News home page

బాధను దిగమింగి వెలుగులు పంచారు

Jun 6 2026 12:23 AM | Updated on Jun 6 2026 12:23 AM

కోల్‌సిటీ(రామగుండం): ఇంటిపెద్దను కోల్పోవడం ఆ కుటంబానికి తీరని విషాదమే. అలాంటి సమయంలో సాధారణంగా ఎవరూ ఆలోచించలేని నిర్ణయాన్ని ఆ మూడు కుటుంబాలు తీసుకున్నాయి. తమ బాధను దిగమింగుకుని మరొకరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేత్రదానానికి అంగీకరించాయి. ఫలితంగా ముగ్గురి కార్నియాలు ఆరుగురికి చూపు ప్రసాదించే అవకాశాన్ని కల్పించాయి. ‘మనవారు లేరు... కానీ వారి కళ్లతో ఇంకొందరు ఈ ప్రపంచాన్ని చూడాలి’ అనే ఆలోచనతో వారు చేసిన నేత్రదానం మానవత్వానికి అద్దం పడుతోంది. వివరాల్లోలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంతోష్‌నగర్‌కు చెందిన ఎ.రాయమల్లు(55), ఎల్‌బీనగర్‌కు చెందిన ఎం.రవీందర్‌(45), రామగిరి మండలం చందనాపూర్‌ గ్రామానికి చెందిన పి.సారయ్యగౌడ్‌(55) వేర్వేరు కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ మూడు కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. సదాశయ ఫౌండేషన్‌ ప్రతినిధులు, ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్‌ సిబ్బంది వారిని కలిసి నేత్రదానం ప్రాధాన్యాన్ని వివరించారు. వారు గొప్ప మనసుతో మృతుల నేత్రాలను దానం చేయడానికి అంగీకరించారు. మృతుల కార్నియాలు సేకరించిన ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్‌ టెక్నీషియన్‌ ప్రదీప్‌ నాయక్‌ సకాలంలో హైదరాబాద్‌కు తరలించారు. సర్పంచ్‌ కొండ మంజుల – శ్రీనివాస్‌, సదాశయ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌ కుమార్‌, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకష్ణారెడ్డి, నూక రమేశ్‌, మారెల్లి రాజిరెడ్డి, లగిశెట్టి చంద్రమౌళి, నల్లవెల్లి శంకర్‌, కేఎస్‌ వాసు, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు ఎల్లప్ప, సారయ్య, రాజేంద్రకుమార్‌, కజాంపురం రాజేందర్‌, పి.మల్లికార్జున్‌, ప్రమోద్‌కుమార్‌రెడ్డి తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను తీవ్రంగా కలిచివేస్తాయని వారు వివరించారు.

కౌలు రైతు ఆత్మహత్య

యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్‌ గ్రామానికి చెందిన కౌలురైతు పొన్నం సారయ్యగౌడ్‌(55) శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని టూటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. సారయ్యగౌడ్‌ తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమితోపాటు రైతుల నుంచి మూడేకరాలు కౌలుకు తీసుకొన్నాడు. పెట్టుబడి కోసం దాదాపు రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు పండకపోవడం, అప్పులు తీర్చేదారిలేకపోవడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు పొన్నం కిశోర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు అడిషనల్‌ సీఐ లింగమూర్తి తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కౌలురైతు కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్‌ కొండ మంజుల, గ్రామస్తులు కోరారు.

రవీందర్‌(ఫైల్‌)

రాయమల్లు(ఫైల్‌)

ఒకేరోజు ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు

నేత్రాలు దానం చేసిన కుటుంబాలు

Advertisement
 
Advertisement
Advertisement