కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్‌క్రైం/కరీంనగర్ అర్బన్: నగరంలో వర్షం దంచికొట్టింది. గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలివానతో బీభత్సం సృష్టించింది. తీవ్ర ఎండవేడితో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వర్షం కాస్త ఉపశమనమిచ్చింది. వర్షానికి ప్రధాన రహదారులు, రోడ్లు, వీధులు జలమయం అయ్యాయి. కేబుల్ బ్రిడ్జి చౌరస్తా చెరువును తలపించింది ఆదర్శనగర్ మెయిన్‌రోడ్డు పూర్తిగా జలమయమైంది. కార్పొరేటర్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ పరిస్థితిని స్వయంగా పరిశీలించి, వరదనీటిని డ్రైనేజీల్లోకి మళ్లింపజేశారు. హుస్సేనిపుర, కట్టరాంపూర్, కోతిరాంపూర్, ముకరంపుర తదితర ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపై ప్రవహించింది. కట్టరాంపూర్‌లో డ్రైనేజీ నిర్మాణాన్ని సగంలోనే వదిలివేయడంతో మురుగ వీధుల్లో ప్రవహించింది. ఇండ్లల్లోకి రాకుండా ఆ ప్రాంతవాసులు శ్రమించాల్సి వచ్చింది. పోచమ్మవాడలో భారీ చెట్లు పడిపోయి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. కట్టరాంపూర్‌లో చెట్టు విరిగి కారుపై పడింది. ముకరంపురలో నాలాను డిప్యూటీ మే యర్ యాదగిరి సునీల్‌రావు స్వయంగా పరిశీలించారు. గాలివానకు ప్రధాన రహదారులపై ఉన్న హోర్డింగ్‌ల్లోని ఫ్లెక్సీలు చిరిగి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి.
జలసంద్రంగా జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్
వర్షానికి జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ జలయయమైంది. కార్యాలయ ప్రాంగణం నీటమునిగి పోగా, రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మునిగిపోయాయి. వాహనాలను బయటకు తీసేందుకు శ్రమించాల్సి వచ్చింది.
హుజూరాబాద్‌లో 5.8 సెం.మీల వర్షం
తొలకరి జల్లులు జిల్లాను పలకరించడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గురువారం సాయంత్రం అత్యధికంగా హుజూరాబాద్‌లో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మానకొండూరులో 4.2, కరీంనగర్లో 4, వీణవంకలో 3.3, సైదాపూర్‌లో 2.1, జమ్మికుంటలో 1.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఆదర్శనగర్‌లో రోడ్డు జలమయం
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో..
కట్టరాంపూర్‌లో కారుపై పడిన చెట్టు
హోర్డింగ్‌కు ప్రమాదకరంగా వేలాడుతున్న ఫ్లెక్సీ
కట్టరాంపూర్‌లో ఇళ్లమధ్య మురుగు వరద


