అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

రాయికల్‌: పట్టణంలోని ధనరేకుల రాజేశ్‌ (37) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. రాజేశ్‌ ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. అప్పు చెల్లించలేని పరిస్థితి ఉండటంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశ్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. లత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భార్యను హింసించిన వ్యక్తి అరెస్ట్‌

జగిత్యాలరూరల్‌: కట్టుకున్న భార్యను హింసించడంతోపాటు ఆమె హత్యాయత్నం చేసిన బీర్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన నేరెళ్ల నరేశ్‌ను గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు. నరేశ్‌కు బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన యువతితో 13ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. కొద్దికాలంగా భార్యను కొడుతూ, తిడుతూ ఇబ్బందులకు గురిచేయగా.. ఫిబ్రవరిలో బీర్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో నరేశ్‌పై గృహ హింస చట్టం కింద కేసు నమోదైంది. అయినప్పటికీ తీరు మార్చుకోని నరేశ్‌ బుధవారం అర్ధరాత్రి భార్యను క్రికెట్‌ బ్యాట్‌తో కొడుతూ.. మెడకు చున్నీ బిగించి హత్యాయత్నం చేయగా పిల్లలు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

పేకాట రాయుళ్లు..

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని గోవిందుపల్లి, హౌసింగ్‌బోర్డుకాలనీలోని రెండిళ్లలో వేర్వేరుగా పేకాట ఆడుతుండగా పట్టణ ఎస్సై సుప్రియ, సీసీఎస్‌ పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. గోవింద్‌పల్లిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.57 వేలు స్వాధీనం చేసుకున్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.6300 స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement