రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు
పోటీలను ప్రారంభిస్తున్న చైర్మన్ బాలకిష్టారెడ్డి, వీసీ ఉమేశ్‌కుమార్, తదితరులు
కరీంనగర్‌స్పోర్ట్స్: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీపీఈసెట్) 2026 శారీరక, నైపుణ్య పరీక్షలను ఆదివారం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వీసీ ఉమేశ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం మనదేశం యువభారత్‌గా ఉందని, క్రీడలతో మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. వీసీ మాట్లాడుతూ, వ్యాయామ విద్యకు చాలా ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు శక్తిమేరకు ప్రయత్నం చేసి తెలంగాణ పీఈసెట్‌కు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం 100 మీటర్ల రన్నింగ్‌ను ప్రారంభించారు. పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్, పాలమూరు విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి లక్ష్మీకాంత రాథోడ్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, వర్సిటీ రిజిస్ట్రార్ సతీశ్‌కుమార్, హరికాంత్, నజీముద్దీన్ మునవర్, ప్రభాకర్‌రెడ్డి, దీప్లా, జగన్, సుధాకర్‌రావు, సునీల్‌కుమార్, దిలీప్, పీడీ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
తొలి రోజు 721 మందికి పరీక్షలు
ప్రవేశ పరీక్షలో భాగంగా తొలిరోజు బీపీఈడీకి 712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 531 మంది హాజరయ్యారు. డీపీఈడీకి 285 మంది దరఖాస్తు చేసుకోగా 190 మంది హాజరైనట్లు పీఈసెట్ కన్వీనర్ రాజేశ్‌కుమార్ తెలిపారు. శారీరిక సామర్థ్య పరీక్షల్లో భాగంగా పురుషులకు 100, 800 మీటర్ల పరుగు, షాట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్ పోటీలతో పాటు 11 క్రీడల్లో ఎంచుకున్న ఒక క్రీడలో పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు.


