అభ్యర్థులు సమయానికి చేరుకోవాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026(టీజీపీఈసెట్) శారీ రక, నైపుణ్య పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి తర ఫున శాతవాహన విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 2 సంవత్సరాల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 3 వరకు శారీరక పరీక్షలు జరగనుండగా.. జూన్ 6న ఫలితాలను వెల్లడించనున్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు జరగనున్న ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలక్రిష్టారెడ్డి, సెక్రటరీ ఆచార్య శ్రీరామ్ వెంకటేశ్, శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఉమేశ్‌కుమార్ హాజరు కానున్నారు. ఆదివారం 993 మంది పురుష అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ రాజేశ్‌కుమార్ తెలిపారు.
మొత్తం 500 మార్కులు
శారీరక పరీక్షలకు మొత్తం 500 మార్కులుంటాయి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(400 మార్కులు). అందరికీ తప్పనిసరి అయిన 4 అథ్లెటిక్స్ ఈవెంట్లు ఉంటాయి. ప్రతీ ఈవెంట్‌కు 100 మార్కులుంటాయి. స్కిల్ ఎఫిషియెన్సీ టెస్ట్ 100 మార్కులుంటాయి. ప్రభుత్వం ఆమోదించిన ఆటల్లో అభ్యర్థి తనకు నచ్చిన ఏదైనా ఒక ఆటను ఎంచుకొని అందులో తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి. అభ్యర్థులు ర్యాంకు సాధించడానికి మొత్తం మార్కుల్లో కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు లేవు.
అభ్యర్థులకు సూచనలు
● అభ్యర్థి తప్పనిసరిగా హాల్ టికెట్‌ను చూపించాలి.
● హాల్ టికెట్‌లో ఉన్న మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
● స్పోర్ట్స్, ఎన్‌సీసీ సర్టిఫికెట్లకు అదనపు ఇన్సెంటివ్ మార్కులు పొందడానికి, అభ్యర్థులు తమ అత్యున్నత క్రీడా ప్రతిభ, ఎన్‌సీసీకి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను పరీక్ష సమయంలో వెరిఫికేషన్ కోసం చూపించాలి.
● క్రీడాపత్రాల గెజిటెడ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలను హాల్ టికెట్ జిరాక్స్ కాపీతో కలిపి పరీక్ష సమయంలో సమర్పించాలి.
● హాల్ టికెట్‌ను అభ్యర్థి చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. అడ్మిషన్ల కౌన్సెలింగ్ సమయంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
● కేటాయించిన తేదీన అభ్యర్థికి ఏదైనా ఇతర పరీక్ష ఉన్నా.. లేదా సరైన బలమైన కారణం వల్ల హాజరు కాలేకపోయినా.. వారికి మిగిలిన పరీక్ష తేదీల్లో ఏదో ఒకరోజు అవకాశం కల్పిస్తారు.
● గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు, ఇతర శారీరక సమస్యలతో బాధపడేవారిని శారీరక సామర్థ్య పరీక్షలకు అనుమతించరు.
స్కిల్ టెస్ట్ పరికరాలు
అభ్యర్థులు ఎంచుకున్న క్రీడానైపుణ్య పరీక్షకు సంబంధించిన సొంత క్రీడా పరికరాలను వెంట తెచ్చుకోవాలి. హాల్ టికెట్‌లో కేటాయించిన రిపోర్టింగ్ సమయం కంటే కనీసం ఒక గంట ముందుగానే శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
ప్రారంభించనున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలక్రిష్టారెడ్డి
తొలిరోజు 993 మంది పురుష అభ్యర్థులకు స్కిల్ పరీక్షలు
ఏర్పాట్లు పూర్తి చేసిన శాతవాహన యూనివర్సిటీ
తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల ప్రకారం బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను పూర్తి పారదర్శక పద్ధతిలో నిర్వహిస్తాం. అభ్యర్థులు నిర్దిష్ట సమయానికి చేరుకోవాలి. ప్రతిభ, శారీరక సామర్థ్యం ఆధారంగానే మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, హాల్ టికెట్లతో ఒక గంట ముందే మైదానానికి చేరుకొని పరీక్షల నిర్వహణకు సహకరించాలి.
– రాజేశ్‌కుమార్, కన్వీనర్, టీజీపీఈసెట్–2026


