పనులకు టెండర్‌ రీకాల్‌ | - | Sakshi
Sakshi News home page

పనులకు టెండర్‌ రీకాల్‌

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

● బల్దియాలో సింగిల్‌ టెండర్లు రద్దు ● రూ.50 కోట్ల పనులకు బాలారిష్టాలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థలో యూఐడీఎఫ్‌ టెండర్లకు బాలారిష్టలు తప్పడం లేదు. గతంలో ఒకసారి రద్దు అయి, మళ్లీ టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసిన సమయంలో సింగిల్‌ టెండర్ల కారణంగా 71 పనులను శనివారం రీకాల్‌ చేశారు. సింగిల్‌ టెండర్‌ దాఖలు కావడంతో రీకాల్‌ చేసి ఆ పనులకు మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

తొలి నుంచి వివాదమే.

యూఐడీఎఫ్‌ నిధులు రూ.50 కోట్లతో నగరంలో చేపడుతున్న పనులకు సంబంధించి గతంలో ఒక సారి టెండర్‌ పిలిచారు. విలీన ప్రాంతాలు ప్రాధాన్యంగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఇదే సమయంలో నగరపాలకసంస్థ ఎన్నికలు రావడం, కొత్త పాలకవర్గం ఏర్పడింది. అభివృద్ధిని నగరవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో కొత్త పాలకవర్గం ఆ టెండర్లను రద్దు చేసింది. విలీన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూనే, నగరంలోని అన్ని డివిజన్‌లకు పనులు పెడుతూ మరోసారి కొత్తగా టెండర్‌ పిలిచింది. నగరవ్యాప్తంగా పనులు జరగనుండడంతో అన్ని పార్టీల కార్పొరేటర్లు పాత టెండర్లు రద్దు చేసి కొత్త పనులను ఆమోదించారు. ఇటీవల రూ.50 కోట్లతో 87 పనులకు టెండర్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక పనులు మొదలు పెట్టడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో 69 పనులకు సింగిల్‌టెండర్‌ దాఖలైందనే వివాదం మొదలైంది. అధికార పార్టీకి చెందిన ఓ నేత సింగిల్‌టెండర్లపై ఫిర్యాదు చేయడంతో, ఆ టెండర్లను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. మొత్తంగా 87 పనులకు గాను సింగిల్‌ టెండర్‌లు దాఖలైన 71 పనులకు సంబంధించిన టెండర్‌ రద్దు చేసి రీకాల్‌ చేసినట్లు నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తెలిపారు. ఈ పనులకు మళ్లీ టెండర్లు నిర్వహిస్తున్నామని, నిర్ణీత వ్యవధిలో ఓపెన్‌ చేస్తామన్నారు. కాగా యూఐడీఎఫ్‌ రూ.50 కోట్ల పనులకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో, పనులు ఎప్పుడు మొదలవుతాయో అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement