కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉంటున్న నేపాలీ, ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు నమోదు చేయాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. శనివారం కమిషనరేట్ కేంద్రంలో పోలీస్‌స్టేషన్ల పనితీరు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయి భద్రతా చర్యలపై వీసీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కరీంనగర్ పరిధిలో దాదాపు 1000 మంది వరకు నేపాలీలు పనిచేస్తున్నారని, 169 మంది వివరాలే నమోదయ్యాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి కూలీలుగా, కార్మికులుగా పనిచేస్తున్న వారి వివరాలు సంబంధిత పోలీస్‌స్టేషన్లలో రికార్డు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో కేసుల పరిశోధన, ట్రాకింగ్, రికార్డుల పరిశీలన సీసీటీఎన్‌ఎస్ పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అసాంఘిక శక్తులు, రౌడీ, హిస్టరీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. మాల్ఖానాలోని ప్రతి వస్తువు రికార్డుల్లో స్పష్టంగా నమోదు కావాలని ఆదేశించారు. సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్‌జీ, సీఐ సరిలాల్, కమ్యూనికేషన్ సీఐ ప్రవీణ్ పాల్గొన్నారు.


