జనగణనకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

జనగణనకు కసరత్తు

Mar 1 2026 7:35 AM | Updated on Mar 1 2026 7:35 AM

జనగణనకు కసరత్తు

జనగణనకు కసరత్తు

● మార్చి 5 నుంచి మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ● తదుపరి ఫీల్డ్‌ ట్రైనర్లకు.. ● ఏప్రిల్‌ 1 నుంచి ఎన్యుమరేటర్లతో జనగణన

2011 లెక్కల ప్రకారం

జిల్లా జనాభా: 10,05,711

నివాసాలు: 2,58,485

కుటుంబాలు: 2,90,657

కరీంనగర్‌ అర్బన్‌: జనగణనకు కసరత్తు వేగవంతమవుతోంది. కరోనాకాలం నుంచి ఆగుతూ సాగిన సదరు ప్రక్రియకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఏప్రిల్‌ 1 నుంచి జనగణన జరగనుండగా ఏర్పా ట్లు చేస్తున్నారు. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులను నియమించనుండగా మాస్టర్‌ ట్రైనర్లుగా 34 మంది ప్రొఫెసర్లను ఎంపిక చేశారు. వారికి మార్చి 5 నుంచి హైదరాబాద్‌లో శిక్షణ జరగనుంది. సదరు ట్రైనర్లతో జిల్లాలో ఫీల్డ్‌ ట్రైనర్లకు శిక్షణనివ్వనున్నారు. ఫీల్డ్‌ ట్రైనర్లుగా జూనియర్‌ లెక్చరర్లను ఎంపిక చేశారు. ఇప్పటికే బ్లాకులుగా విభజించిన అధికారులు ఇళ్లు, కట్టడాల వివరాలతో పాటు సౌకర్యాల వివరాలను నమోదు చేయనున్నారు. ఇక సదరు ప్రక్రియ అంతా స్మార్ట్‌ఫోన్‌లోనే జరగనుండగా ఇంటర్నెట్‌ లేకున్నా యాప్‌ పని చేయనుంది.

మున్సిపాలిటీల్లో పెరిగిన బ్లాకులు

జనగణనలో నివాసాల సంఖ్యను బట్టి ఎన్యుమరేటర్‌ బ్లాక్‌ను నిర్ణయిస్తారు. 120– 150 నివాసాలను ఒక బ్లాక్‌గా విభజించగా సదరు బ్లాక్‌కు ఒక ఎన్యుమరేటర్‌ను నియమిస్తారు. ఈ క్రమంలో బ్లాకుల సంఖ్య మున్సిపాలిటీల్లో పెరగగా పలు మండలాల్లో సంఖ్య తగ్గింది. కరీంనగర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల్లో గ్రామాలను విలీనం చేయగా రూరల్‌ మండలాల్లో గ్రామాల సంఖ్య తగ్గింది. దీంతో పట్టణాల్లో బ్లాకుల సంఖ్య పెరగగా మండలాల్లో తగ్గింది. అత్యధికంగా కరీంనగర్‌లో బ్లాక్‌ల సంఖ్య ఉంది. గత జనగణనలో 388 బ్లాకులుగా లెక్కించగా ఈ సారి 808కి చేరింది. అంటే 420 బ్లాక్‌లు పెరిగాయన్న మాట. జమ్మికుంటలో గతంలో 139 బ్లాక్‌ల్లో గణన జరగగా ఈ సారి 83కు పరిమితమైంది. అలాగే హుజూరాబాద్‌ రూరల్‌లో 124 బ్లాక్‌లు కాగా 79కు చేరింది.

రెండేసి సార్లు పరిశీలన

స్మార్ట్‌ఫోన్‌లో జనగణన యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలను నమోదు చేయనున్నారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్‌ ఉండాలి. ఇంటింటికి వెళ్లి వివరాలను నమోదు చేసే సమయంలో అవసరం లేదు. వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాలి. వాటిని అప్‌లోడ్‌ చేసే సమయంలో మళ్లీ ఇంటర్నెట్‌ అవసరం ఉండనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సమస్యలు ఎదురవుతుండటంతోనే ఆఫ్‌లైన్‌ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో జనగణన కార్యక్రమం చేపట్టనుండగా ఎన్యుమరేటర్లకు జనవరి, ఆ తదుపరి రెండు దశల్లో శిక్షణనిస్తారు. ఎన్యుమరేటర్‌ తనకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లకు రెండు దశల్లో వెళ్లి వివరాలు నమోదు చేయాలి. వచ్చే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరులోగా మొదటి దశ కింద ప్రతి ఇల్లు, కట్టడం వివరాలన్నీ సేకరించనుండగా రెండో దశలో వ్యక్తిగత వివరాల సేకరణ కార్యక్రమం 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. జిల్లాలో 316 గ్రామ పంచాయతీలు, 4 మునిసిపాలిటీలుండగా 2.62లక్షల నివాసాలున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో నిర్మాణమైన కొత్త భవనాలను పరిగణలోకి తీసుకున్నారు. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులను తీసుకోనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించనుండగా పర్యవేక్షకులుగా స్కూల్‌ అసిస్టెంట్లు, హెచ్‌ఎం, యంఆర్‌సీలను నియమించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement