మొండి బకాయిదారులపై చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్: ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారులపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హెచ్చరించారు. శనివారం నగరంలోని రాంనగర్, కోతిరాంపూర్, రేకుర్తి, కాపువాడ, అలుగునూరులో చేపట్టిన ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నుల వసూళ్లలను పరిశీలించారు. స్వయంగా షాప్‌లను సందర్శించి ట్రేడ్‌లైసెన్స్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవాసులు తమ ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్ను, నల్లా పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలన్నారు. 2025–2026 ఆర్థిక సంవత్సరం మార్చి 31 తో ముగుస్తున్నందున ఆ లోగా తమ ఇంటి పన్నులను చెల్లించాలన్నారు. వార్డు అధికారులు డివిజన్ల వారిగా క్షేత్రస్థాయిలో తిరిగి ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మొండి బకాయిదారుల నుంచి పన్నులు కట్టించేలా రెవెన్యూ విభాగం అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న వారికి రెడ్ నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసు గడువు ముగిసిన తరువాత కూడా చెల్లించని బకాయిదారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, ఆర్‌వో శివానందం పాల్గొన్నారు.


