మావోయిస్టు గణపతి! | - | Sakshi
Sakshi News home page

మావోయిస్టు గణపతి!

Feb 28 2026 7:36 AM | Updated on Feb 28 2026 7:36 AM

మావోయ

మావోయిస్టు గణపతి!

అలసిన దళపతి.. మావోయిస్టు గణపతి!

అలసిన దళపతి..

సాక్షి,కరీంనగర్‌ డెస్క్‌: మావేయిస్టు నేత.. లక్ష్మణ్‌రావు 1949 జూన్‌ 16న బీర్పూర్‌లో జన్మించారు. 5వ తరగతి వరకు బీర్‌పూర్‌, 7వ తరగతి వరకు అదే జిల్లాలోని తుంగూర్‌లో చదువుకున్నారు. పీయూసీ జగిత్యాలలో, కరీంనగర్‌లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు రావడంతో మొదట ప్రస్తుత పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో పనిచేశారు. సైన్స్‌, లెక్కలు, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు బోధించారు. ఎలగందుల, మేడిపల్లి మండలం గోవిందారంలో విధులు నిర్వహించారు. ఇదే సమయంలో పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన సరస్వతిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు జన్మించాడు. 1972–73లో బీఈడీ ట్రైనింగ్‌ కోసం వరంగల్‌ వెళ్లి అక్కడి నుంచి అటే అజ్ఞాతబాట పటారు. ఉపాధ్యాయుడిగా పిల్ల లకు చదువు నేర్పిన గణపతి.. ఉద్యమంలో విప్లవపాఠాలు నేర్పారు.

ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు టీచర్‌గా పనిచేసిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు ప్రభుత్వ పాఠశాల

ఉపాధ్యాయుడిగా గణపతి తీసుకున్న జీతం.. రిజిష్టర్‌లో ఆయన సంతకం

బీర్‌పూర్‌లో మావోయిస్టులు నిర్మించిన అమరవీరుల స్తూపం

టీవీలో చూసి..

2004లో దేశంలో అనేక రాష్ట్రాలలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు విస్తరింపజేశారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయనపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటించాయి. జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్న లక్ష్మణ్‌రావు ఉరఫ్‌ గణపతి పీపుల్స్‌వార్‌లో కొండపల్లి, కేజీ సత్యమూర్తి, కిషన్‌జీ తర్వాతి స్థానంలో ఉండేవారు. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు రచించడంలో ముందుండే ఆయనను అగ్రనేతగా కొనసాగాలని కోరడంతో పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. అందరికంటే ఎక్కువ కాలం 25 ఏళ్లపాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి పనిచేయడం విశేషం. మావోయిస్టు గణపతి 2010లో నక్సల్స్‌ దళాలను ఉద్దేశించి ప్రసగించిన వీడియో అప్పట్లో కొన్ని టీవీ చానళ్లలో ప్రసారమైంది. గణపతి ఇలా ఉంటారా? అంటూ బీర్పూర్‌ పరిసర గ్రామాల ప్రజలు ఆసక్తిగా చూశారు. అప్పటి వీడియో, ఫొటోలే ఇప్పడు మీడియాలో వస్తున్నాయి.

జగిత్యాల జైత్రయాత్రతో..

జగిత్యాల పట్టణంలో 1978 సెప్టెంబర్‌ 9వ తేదీన జగిత్యాల జైత్రయాత్ర చేపట్టారు. జైత్రయాత్ర తర్వాతే రైతుకూలి సంఘం కొండపెల్లి సీతారామయ్య నేతృత్వంలో పీపుల్స్‌వార్‌గా ఆవిర్భవించింది. ఇదే ప్రయోగశాలగా మారి దేశంలో 17 రా ష్ట్రాల్లో ఉద్యమ వ్యాప్తికి దోహదపడింది. అప్పుడు ఈ యాత్రలో దాదాపు 3.50 లక్షల మంది పాల్గొన్నారు. ‘దున్నేవాడికే భూమి’ అంటూ జగిత్యాల పుర వీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించి స్థానిక ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్‌లో బహిరంగసభ నిర్వహించారు. మావోయిస్టు అధినేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఉరఫ్‌ గణపతి, మల్ల్లోజుల కోటేశ్వర్‌రావు, మాదాసు వేణుగోపాల్‌రావు, నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్‌, ముంజీం రత్నయ్య, భైరి గంగారాం, అంగె ఓదెలు తదితర నేతలు పాల్గొన్నారు. బహిరంగసభలో ప్రజాయుద్ద నౌక గద్దర్‌ గజ్జెకట్టి ఆడిపాడారు. అలా.. మొదలైన తిరుగుబావుట దండకారణ్యంలోని జనతన సర్కార్‌ నిర్మాణం వరకు కొనసాగింది. 1992 వరకు కొండపల్లి సీతారామయ్య నడిపించిన పీపుల్స్‌వార్‌ పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికై 2004లో బిహార్‌ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ వరకు సాగింది. సీపీఐ మావోయిస్టుగా ఏర్పడ్డ తర్వాత కూడా గణపతి దళపతిగా కొనసాగారు.

ఆపరేషన్‌ కగార్‌తో ఫినిషింగ్‌ టచ్‌

ఐదు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటున్న బడి పంతులు ఇప్పుడు అనారోగ్యంతో అలిసిపోయారు. పాతికేళ్లుగా మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గణపతి.. వయోభారంతో నడవలేని స్థితిలో సతమతమవతున్నట్లు తెలిసింది. చూపు మందగించి.. జ్ఞాపకశక్తి సరిగాలేదని తెలుస్తోంది. అయితే ఆపరేషన్‌ కగార్‌ ఫినిషింగ్‌ టచ్‌ గణపతితో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ గణపతి లొంగిపోయినా.. అరెస్టు అయినా ఓ సంచలనమే.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమే.!

1977లోనే తొలి పోలీసు కేసు..

పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో 1975–76లో ఇప్పటి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్‌లోని భూస్వామి పితంబర్‌రావుతోపాటు కుటుంబ సభ్యులను నక్సల్స్‌ హతమార్చారు. ఈ ఘటనలో అదే జిల్లా కలమడుగు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ హత్యతో ప్రమేయం ఉందని అప్పట్లో పోలీసులు 16 మందిపై కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ–1గా కొండపల్లి సీతారామయ్యను, ఏ–8గా ముప్పాల లక్ష్మణ్‌రావును పేర్కొన్నారు. 1977లో గణపతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్‌ జైలులో శిక్ష అనుభవించిన గణపతి మూడు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదు.

మావోయిస్టు గణపతి!1
1/4

మావోయిస్టు గణపతి!

మావోయిస్టు గణపతి!2
2/4

మావోయిస్టు గణపతి!

మావోయిస్టు గణపతి!3
3/4

మావోయిస్టు గణపతి!

మావోయిస్టు గణపతి!4
4/4

మావోయిస్టు గణపతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement