గడ్డి మందు.. పల్లెల్లో బంద్
జగిత్యాలఅగ్రికల్చర్: పొలాల్లో కలుపు మొక్కలను చంపేందుకు వాడుతున్న గడ్డి మందు ఇప్పుడు మ నుషులు చావడానికి కారణమవుతోంది. రైతు కు టుంబాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా గడ్డి మందే వా రికి పరామన్నంగా మారుతోంది. చాలా కుటుంబా లను ఆర్థికంగా, సామాజికంగా చిన్నాభిన్నం చేస్తుంది. ఇటీవల కాలంలో గడ్డిమందును నిషేధించాలని ఒకవైపు వైద్యులు, మేధావులు కోరుతుంటే, మరో వైపు తమ గ్రామాల్లో గడ్డిమందును నిషేధిస్తున్నమంటూ స్వచ్ఛందంగా గ్రామపంచాయతీ కమిటీలు తీర్మానాలు చేయడం శుభపరిణామంగా మారింది. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌తోపాటు పలు గ్రామాల్లో గడ్డిమందును నిషేధిస్తూ తీర్మానాలు చేశారు.
60 శాతం గడ్డిమందుతోనే..
జగిత్యాల జిల్లాలో గతేడాది దాదాపు 340 మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోగా, అందులో 204 మంది (60 శాతం) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకర విషయం. ఇందులో రైతు కుటుంబాలకు చెందినవారే 100కు పైగా మృత్యువాతపడ్డారు. కూలీల సమస్యతో పంట పొలాల్లో పెరిగిన కలుపు మొక్కలను తొలగించేందుకు గడ్డిమందును రైతులు వాడటం పరిపాటిగా మారింది. పంటలకు వాడిన తర్వాత అందులో కొంత మిగిలితే ఇంటికి తెచ్చి దాన్ని దాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగినా, పిల్లలను మందలించినా, ఆర్థిక పరిస్థితులతో క్షణికావేశంలో ఇంట్లో దాచిన గడ్డిమందే ఆత్మహత్య చేసుకునేందుకు ఆయుధంగా మార్చుకుని తనువు చాలిస్తున్నారు.
బతకడం కష్టమే..
గడ్డి మందు అనేది కలుపు మొక్కలను ఎదగకుండా చేయడమే కాకుండా వాటి వేర్లతో సహా నాశనం చేస్తుంది. ఒక సెకనులో తీసుకున్న నిర్ణయం చివరకు జీవితాలను లేకుండా చేస్తుంది. చాలా కేసుల్లో గడ్డిమందు తాగినవారు హాయిగా ప్రాణం పోతుందనుకుంటారు. కానీ, గడ్డిమందు మనిషి శరీరంలోకి పోగానే రకరకాల రుగ్మతలకు లోనవుతారు. దీంతో ఆ బాధ భరించలేక గడ్డి మందు తాగామని, తమ కుటుంబీకులకు ఫోన్ల ద్వారా సమాచారం అందిస్తున్నారు. ఈక్రమంలో గ్రామాల నుంచి ఆసుపత్రులకు తరలించేసరికి అత్యంత ప్రభావంతమైన మందు శరీరంలో కలిసిపోతుంది. దీంతో స్పాంజ్ పద్ధతిలో ఉండే ఊపిరితిత్తులు గట్టిగా అవుతాయి. మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వైద్యులు ఎన్నిరకాల చికిత్స చేసినా ఆరోగ్యం సహకరించక అసువులు బాస్తున్నారు. గడ్డిమందు తాగేవారిలో దాదాపు 98 శాతం మృత్యువాత పడుతున్నారని వైద్యులు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా చివరకు గడ్డిమందు పిచికారీ చేసిన పంటలను తిన్న పశువులు సైతం మృత్యువాత పడుతున్నాయి.
ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు
గడ్డిమందు తాగిన వ్యక్తులను ఎలాగైనా బతికించాలనే ఉద్దేశంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో కుటుంబసభ్యులను భయపెట్టడానికి కొంతమంది ఇతర క్రిమిసంహారక మందులు తాగుతున్నారు. ఆ మందు డబ్బాను వైద్యుడికి చూపించగానే, దాని నివారణ మందులను అందించి రోగి ప్రాణాలు కాపాడుతున్నారు. కానీ,, గడ్డిమందు తాగితే నివారణ మందులు పెద్దగా లేవు. ఒకట్రెండు రోజులు బతికినా ఆశలు పెద్దగా పెట్టుకోవద్దని వైద్యులు, కుటుంబసభ్యులకు ముఖం మీదే చెబుతున్నారు. కార్పొరేట్ వైద్యానికి రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. అయితే, ఇటు మనిషి బతుకక, అటు డబ్బులు ఖర్చయిపోవడంతో కుటుంబాలు ఆర్థికంగా దిగజారుతున్నాయి.
గ్రామాల్లో స్వచ్ఛందంగా నిషేధిస్తూ తీర్మానాలు
60 శాతం ఆత్మహత్యలు గడ్డిమందుతోనే..
రైతు కుటుంబాలవారే ఎక్కువ మంది మృత్యువాత


