పశువులకు గ్రాసం కరువు
మంథనిరూరల్: వర్షాకాలంలో సాగు చేసిన వరి.. కోసిన తర్వాత వచ్చేగడ్డినే పశువులు ఎక్కువగా ఇస్టపడతాయి. ఒకప్పుడు కూలీలతో పైరు కోస్తే పొలంలో ఉండే గడ్డి మోపులుగా కట్టేందుకు వీలుండేది. ఇలాంటి గడ్డిని ఇంటికి తీసుకొచ్చి వాముగా పేర్చేవారు. ఏడాదంతా పశువులకు మేతగా వేసేవారు. కాలక్రమేణా హార్వేస్టర్‌లతో కోతలు మొదలు పెట్టడంతో గడ్డిసేకరణ తగ్గిపోయింది. వానాకాలంలో చైన్ హార్వేస్టర్‌లతో కోతలు చేపట్టడంతో వరిగడ్డి పూర్తిగా పనికిరాకుండా పోతోంది. ఈసారి కూడా పశువులకు సరిపడా వరిగడ్డి లభించేలా లేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలు.. వరదలు
మొన్నటి వానాలంలో భారీ వర్షాలతో వరిపంట పెద్దఎత్తున దెబ్బతిన్నది. పొట్ట, కోత సమయంలో తుపాన్ ప్రభావంతో వేల ఎకరాల్లో పంట నేలవాలింది. వందల ఎకరాల్లో పైరు నీటిలోనే పడిపోయింది. పైరు నీటిలో నాని అక్కరకు రాకుండాపోయిందని రైతులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఏటా వరి మాత్రమే సాగు చేయడం, ఇతర పంటలపై మొగ్గు చూపకపోవడం కూడా పశుగ్రాసం కొరతకు కారణమవుతుందని అంటున్నారు.
చైన్ హార్వెస్టర్‌లో తుక్కుతుక్కు
సాధారణ హార్వెస్టర్‌తో వరిపైరు కోస్తే వరిగడ్డి మామూలుగా వస్తుంది. కానీ చైన్‌హార్వెస్టర్‌తో కోస్తే పూర్తిగా తుక్కుతుక్కు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఈసారి కోత సమయంలో పొలాల్లో నీరు, బురద ఉండడంతో అత్యధిక శాతం మంది రైతులు చైన్ హార్వెస్టర్‌లతోనే కోతలు కోయించారు, దీంతో వరిగడ్డి కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఊళ్లలో కనిపించని గడ్డివాములు
పెద్దపల్లి జిల్లాలోని అనేక గ్రామాల్లో పశువులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వ్యవసాయం ఎక్కువగా చేసే గ్రామాల్లో పశువులను పెంచుకోవడం అలవాటుగా ఉంటుంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా బర్రెలు, ఎద్దులు, ఆవులు అధికంగానే ఉన్నాయి. ఈ క్రమంలో పశువుల మేత కోసం కోతలు ముగిశాక ఎడ్లబండ్లలో గడ్డిని ఇంటికి తరలించి వాములు ఏర్పాటు చేసుకునేవారు. ప్రతీరైతు పెరట్లో గడ్డివాము దర్శనమిచ్చేది. ఈసారి ఏ రైతు ఇంట్లో గడ్డివాము కనిపించడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తామనుకున్నా అక్కడ సైతం కొరత ఉందని రైతులు చెబుతున్నారు.
వర్షాలు, వరదలతో దెబ్బతిన్న వరి
చైన్ హార్వేస్టర్‌లతోనే కోతలు
అక్కరకు రాకుండాపోతున్న గడ్డి
గ్రామాల్లో కనుమరుగవుతున్న వాములు
ఆందోళన వ్యక్తం చేస్తున్న పశుపోషకులు


