30వేలు!
అంగట్లో నగరపాలక ట్రాక్టర్ డ్రైవర్ పోస్టులు
35 మంది నుంచి అక్రమ వసూళ్లు
రూ.30 వేల చొప్పున రూ.10.50 లక్షలకు బేరం?
బల్దియాలో తాజా అవినీతి బాగోతం
సర్దుబాటు మాత్రమే
డ్రైవర్ సీటు
@
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ఇటీవల నగరపాలకసంస్థకు కొత్తగా 35 ట్రాక్టర్లు వచ్చాయి. ఈ ట్రాక్టర్ల డ్రైవర్ పోస్టుకు డిమాండ్ ఏర్పడింది. పని సులువుతో పాటు, డ్రైవర్‌గా రెగ్యులరైజ్ అయితే రూ.15వేలు ఉన్న వేతనం మరో రూ.10 వేలు పెరుగుతుంది. చెత్త పేరుతో బయట ‘కలెక్షన్’ కూడా ఉంటుంది. ఇదే అదనుగా బల్దియాలో కొంతమంది తమకు అలవాటైన చేతివాటాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు 35 మంది కార్మికులకు డ్రైవర్ ‘సీటు’ ఇచ్చేందుకు రూ.30 వేల చొప్పున రూ.10.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం.
బల్దియాకు 35 కొత్త ట్రాక్టర్లు
ఇటీవల 35 ట్రాక్టర్లు నగరపాలకసంస్థకు వచ్చాయి. 25 పారిశుధ్యానికి సంబంధించినవి కాగా, మిగతా 10 వాటర్ ట్యాంకర్లు. పారిశుధ్యానికి కేటాయించిన 25 ట్రాక్టర్లను ఆయా డివిజన్లకు అప్పగిస్తున్నారు. చెత్త సేకరణకు గతంలో రెండు డివిజన్లకు ఒక ట్రాక్టర్ మాత్రమే ఉండేది. దీనితో చెత్త సేకరణ అనుకున్న మేర వేగంగా జరిగేది కాదు. ఈ సమస్యలను అధిగమించేందుకు కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. పాత, కొత్త కలిపి దాదాపు ప్రతి డివిజన్‌కు ఒక ట్రాక్టర్‌ను చెత్తసేకరణకు కేటాయిస్తున్నారు.
ఆ 30 మంది కూడా?
గతంలో తొలగించిన ఔట్‌సోర్సింగ్ కార్మికుల్లో కొంతమంది డ్రైవర్ సీటు కోసం ప్రయత్నించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో నిబంధనలకు విరుద్ధంగా ఔట్‌సోర్సింగ్ కార్మికులను నియమించారంటూ ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేపట్టి 30 మందిని తొలగించారు. అందులో కొంతమంది మళ్లీ డ్రైవర్లుగా చేరేందుకు పైరవీలు చేసినప్పటికీ.. ఫలించలేదని సమాచారం.
ఒక్కొక్కరికి నుంచి రూ.30 వేలు?
కొత్తగా 35 ట్రాక్టర్లు రావడంతో డ్రైవర్ సీటుకు డిమాండ్ పెరిగింది. సాధారణంగా ఔట్‌సోర్సి ంగ్ కార్మికులకు రూ.15 వేలు వేతనం ఉంటుంది. డ్రైవర్లకు రూ.10 వేలు అదనంగా కలిపి రూ.25వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. చెత్త సేకరించే ట్రాక్టర్ కావడంతో బయట కలెక్షన్లు ఉంటాయి. అందుకే డ్రైవర్ సీటుకు డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం 35 ట్రాక్టర్లు కొత్తగా రావడంతో, ఆ డ్రైవర్ పోస్టులు కావాలంటూ కార్మికులు తమకున్న పరిచయాలతో పైరవీలు మొదలు పెట్టా రు. ఇదే అదనుగా కొంతమంది అధికారులు రూ.30 వేలు ఇస్తే డ్రైవర్ సీటు అప్పగిస్తామని బేరం మాట్లాడుకున్నట్లు ప్రచా రం జరుగుతోంది. తనకు డ్రైవర్ పోస్టు అప్పగిస్తామంటే రూ.30 వేలు ఇచ్చానంటూ ఓ కార్మికుడు బహిరంగంగానే చెప్పడం ప్రచారా నికి బలం చేకూరుస్తోంది. డ్రైవర్‌గా పనిచేసినంత మాత్రాన డ్రైవర్ కారని, కార్మికుడి పోస్టులోనే ఉంటారని అధికారులు చెబుతున్నారు. డ్రైవర్ పోస్టు మంజూరు అయితేనే డ్రైవర్‌గా పరిగణించి, వేతనం పెరుగుతుందంటున్నారు. డ్రైవర్ పోస్టు పేరిట మోసం చేస్తున్నారో, నిజంగానే మేలు జరుగుతుందని కార్మికులు డబ్బులు ఇస్తున్నారో అధికారులు విచారణ చేపడితే వెల్లడికానుంది.
కొత్తగా వచ్చిన ట్రాక్టర్లపై డ్రైవర్లుగా కార్మికులను కేవలం సర్దుబాటు మాత్రమే చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కొత్తగా ఎలాంటి డ్రైవర్ పోస్టులు మంజూరు కాలేదు. గతంలో రెండు డివిజన్లకు కలిపి ఒక ట్రాక్టర్‌పై డ్రైవర్, హెల్పర్, ఇద్దరు కార్మికులు ఉన్నారు. ఇప్పుడు డివిజన్‌కు ఒక ట్రాక్టర్ రావడంతో, కార్మికులను డ్రైవర్లుగా సర్దుబాటు చేస్తున్నాం. – సుమన్, ఎంహెచ్‌వో, నగరపాలకసంస్థ
30వేలు!


