అన్నదాతల అనాసక్తి | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల అనాసక్తి

Feb 25 2026 9:43 AM | Updated on Feb 25 2026 9:43 AM

అన్నదాతల అనాసక్తి

అన్నదాతల అనాసక్తి

జిల్లాలో రైతులు 2,10,904నమోదు చేసుకున్నవారు 1,26,469చేరుకున్న లక్ష్యం 59.96 శాతం

ఫార్మర్‌ రిజిస్ట్రీకి అపసోపాలు

ఆసక్తి చూపని రైతులు

లక్ష్యం చేరుకోవాల్సిందేనంటూ కలెక్టర్‌ ఆదేశాలు

చిగురుమామిడి ఏవో సస్పెన్షన్‌కు ఆదేశం?

కరీంనగర్‌ అర్బన్‌:ఫార్మర్‌ రిజిస్ట్రీ వ్యవసాయశాఖకు తలనొప్పిగా మారింది. ఈ నెల 28లోగా ప్రతి రైతు వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా.. ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించి రైతులను వివరాలు కోరితే కనీస స్పందన కరవైందన్నది ఏవో, ఏఈవోల ఆవేదన. ఫోన్లు చేసినా, ఇంటింటికి వెళ్లి ఆదార్‌ నంబర్‌ ఇవ్వాలని కోరితే దాటవేస్తున్నారని చెబుతున్నారు. రైతు వివరాల నమోదులో పేలవ ప్రదర్శన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన చిగురుమామిడి ఏవోను సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం.

లక్ష్యానికి ఆమడదూరంలో..

జిల్లాలో 16 మండలాలుండగా.. ఏ ఒక్క మండలంలోనూ వందశాతం లక్ష్యం చేరుకోలేదు. కరీంనగర్‌ అర్బన్‌లో 27మంది రైతులుంటే ఒక్కరు మాత్రమే ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 52.82శాతమే నమోదవగా, కొత్తపల్లి 53.20, మానకొండూరు 54.20శాతం నమోదు చేశారు. అత్యధికంగా రామడుగులో 65.08, చొప్పదండి 65.07, హుజూరాబాద్‌ 64.22 శాతం ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తయింది. జిల్లా మొత్తంగా 84,435 మంది రైతుల వివరాలను నమోదు చేయాల్సి ఉండగా మరో నాలుగు రోజులే గడువు ఉంది.

ఆధార్‌ నంబర్‌ చెప్పేందుకు నిరాకరణ

కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే రైతులు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. నమోదు చేసుకుంటేనే రైతు కు ప్రత్యేక నంబర్‌ కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు ప్రచారం చేస్తుండగా.. స్పందన అంతంతే. వాట్సాప్‌ గ్రూప్‌ల్లో నమోదు చేసుకోనివారి పేర్లను సూచిస్తున్నప్పటికీ ఫలితం శూన్యం. ఏఈవోకు ఆధార్‌ నంబర్‌ చెబితే రెండుసార్లు అనుసంధానించిన ఫోన్‌నంబర్‌కు ఓటీపీ నంబర్‌ వస్తుండగా, సదరు నంబర్లను చెప్పాల్సి ఉంటుంది. తదుపరి మళ్లీ ఆధార్‌ నంబర్‌ను ఎంట్రీ చేసి మరో ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. రెండు నిమిషాల్లో ప్రక్రియ ముగియనుండగా రైతులు ఆధార్‌ నంబర్‌ చెప్పడం లేదు. గ్రామాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినా ఆశించిన లక్ష్యం చేరుకోవడం లేదు. సైబర్‌ క్రైం క్రమంలో ఓటీపీ చెప్పేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారని తెలుస్తుండగా పలు ప్రాంతాల్లో ఎక్కువ భూమి ఉన్న రైతులు తమ ఆధార్‌ చెబితే భవిష్యత్‌లో పథకాలకు దూరమవుతామన్న ఆందోళన నెలకొంది. గతంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించగా ఇప్పుడు వ్యవసాయేతర భూముల యజమానుల వివరాలు నమోదు చేయడం తప్పనిసరిగా మారింది. అంటే పట్టాదారు పాసుపుస్తకం జారీ అయితే చాలు వారి వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు దీనిపై అవగాహన లేక అధికారులకు సహకరించడం లేదు. పలువురు రైతులకు ఫోన్‌ నంబర్లు లేకపోగా ఆధార్‌ అనుసంధానం చేసుకోని వారు వేలల్లో ఉంటారని అంచనా. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేరుకోవడమంటే కష్టమే మరీ. ఏఈవోల వద్దే కాకుండా మీ సేవ కేంద్రాల్లోనూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రైతు వేదికల్లో ఏఈవో వద్ద ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement