పెద్దరాతుపల్లిలో వృద్ధుడి మృతి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామంలో తాటికొండ బాపుచారి(60) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. బాపుచారి – లలిత దంపతులు. వీరికి కుమారులు శివశంకర్, మారుతి ఉన్నారు. భార్య, పిల్లలు కలిసి తనను చంపేందుకు తనశరీరంపై వేడినీళ్లు పోయడంతో గాయాలపాలైనట్లు బాపుచారి ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు గ్రామంలో విచారణ జరపగా.. బాపుచారి మద్యం తాగి కుటుంబసభ్యులతో గొడవ పడుతుండే వాడని గ్రామస్తులు చెప్పారు. ఈక్రమంలోనే మద్యం తాగి వచ్చాడు. కోడిగుడ్లు ఉడకబెట్టే క్రమంలో మద్యం మత్తులో తూలి పక్కనే ఉన్న వేడినీళ్ల కొప్పెరపై పడ్డాడని, ఫలితంగా చర్మం ఊడిపోయిందని భార్య లలిత పేర్కొంది. అనుమానంతో పోలీసులు బాపుచారిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన బాపుచారి మంచంపై పడుకుని కాసేపటికే మృతి చెందాడు. అనుమానం వచ్చిన పోలీసులు పోస్ట్‌మార్టం కోసం శవాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతోనే మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ వివరించారు. మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండడంతో గ్రామస్తులే చందాలు వేసుకుని అంత్యక్రియలు పూర్తిచేశారు.


