హై వోల్టేజీతో ఇల్లు దగ్ధం
● 15 ఇళ్లలో కాలిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రా చర్ల తిమ్మాపూర్‌లో సోమవారం హైవోల్టేజీతో ఇల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు. తిమ్మాపూర్‌కు చెందిన మల్లేశం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కరెంట్ హై వోల్టేజీ సరఫరా కావడంతో షా ర్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు కాలిపోయింది. మల్లేశం భార్య ఇటీవల మరణించింది. ఆటో నడుపుతూ ఇద్దరు కూతుళ్లను పెంచుతున్నాడు. ఇద్దరు కూతుళ్లు స్కూ ల్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంట్లోని నిత్యావసర వస్తువుల కాలిబూడిదయ్యాయి. సర్పంచ్ అందె సుభాష్, ఉప సర్పంచ్ జజ్జరి దేవేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హై వోల్టేజీ కరెంట్ సరఫరా కావడంతో ఆ కాలనీలోని 15 ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి.
14 మంది బైండోవర్
కరీంనగర్‌రూరల్: అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన కేసుల్లో 14 మందిని సోమవారం తహసీల్దార్ రాజేశ్ ఎదుట బైండోవర్ చేసినట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన కన్నం అనిల్, బండారి రాజు, వడ్లకొండ రాజ్‌కుమార్, సిలివేరి శ్రీకాంత్, దర్శనాల లక్ష్మణ్, మానకొండూరు మండలం రాఘవపూర్‌కు చెందిన తిట్ల అనిల్, వెల్ధి గ్రామానికి చెందిన ఆరెల్లి సాయికుమార్‌ను బైండోవర్ చేసినట్లు వివరించారు. మద్యం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన వనపర్తి వంశీకృష్ణ, చాడ రామచంద్రారెడ్డి, ఆవుల శివగణేశ్, చింతల మనోజ్‌కుమార్, మర్రి భరత్‌చంద్ర, చిలుముల సాకేత్, శనిగరపు ప్రణీత్‌ను రూ.లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో వాకర్‌కు గాయాలు
రాయికల్: పట్టణానికి చెందిన వాకర్ చొప్పదండి నర్సయ్యను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. నర్సయ్య, మరికొంతమంది వాకర్స్ కలిసి సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లారు. తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం నర్సయ్యను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. వాకర్స్ ఆయనను ముందుగా జగిత్యాల.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
కథలాపూర్(వేములవాడ): మండలంలోని బొమ్మెన గ్రామానికి చెందిన లోలపు శ్రీనివాస్ (40) మస్కట్‌లో మృతిచెందగా.. ఆయన మృతదేహం సోమవారం ఇంటికి చేరింది. శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం మస్కట్ దేశం వెళ్లాడు. ఈనెల 19న అనారోగ్యానికి గురై మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు ఇటీవల సమాచారం ఇచ్చారు. మృతదేహం ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. శ్రీనివాస్‌కు భార్య సుమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన బాధిత కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీశాఖ అధికారులపై దాడి చేసిన కేసులో నలుగురికి ఆరునెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ వేములవాడ ప్రథమ శ్రేణి జడ్జి జ్యోతిర్మయి తీర్పు చెప్పారు. ఎస్సై మోతీరాం తెలిపిన వివరాలు.. 2018లో మానాల గ్రామానికి చెందిన గుగులోతు మదన్, గుగులోతు గజల్, అజ్మీర బన్సీ, బత్తుల లక్ష్మయ్య ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేర్ల సిద్ధార్థ దాడి చేశారు. అప్పటి ఎస్సై విద్యాసాగర్‌రావు కేసు దర్యాప్తు చేపట్టారు. జడ్జి సాక్ష్యాధారాలు పరిశీలించిన నిందితులకు జైలు, జరిమానా విధించారు.


