సమస్యలు.. సవాళ్లు! | - | Sakshi
Sakshi News home page

సమస్యలు.. సవాళ్లు!

Feb 23 2026 7:06 AM | Updated on Feb 23 2026 7:06 AM

సమస్యలు.. సవాళ్లు!

సమస్యలు.. సవాళ్లు!

● నగర మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన కొలగాని శ్రీనివాస్‌ ● వేసవి యాక్షన్‌ప్లాన్‌పై తొలి సంతకం ● బీజేపీ పాలకవర్గంపై ప్రజల ఆశలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగర అభివృద్ధి.. అందుకు సరిపడా నిధులు.. పాలనలో పారదర్శకత.. సేవల్లో జవాబుదారితనం.. అవినీతి రహిత బల్దియా.. అక్రమాలకు తావులేని పనులు.. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం.. నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ఎదుట ఉన్న ప్రధాన సవాళ్లు ఇవి. కరీంనగర్‌ బల్దియాపై కాషా య జెండా ఎగురవేయాలనే బీజేపీ సుదీర్ఘ కల నెరవేరగా.. ప్రశ్నించేస్థాయి నుంచి పరిపాలించేస్థాయికి ఆ పార్టీ ఎదిగింది. మొదటిసారి బీజేపీ పాలనను చూడబోతున్న నగరవాసులు భారీగానే ఆశలుపెట్టుకున్నారు.

అభివృద్ధి.. నిధులు

నగరపాలకసంస్థను ఏళ్లుగా నిధుల సమస్య వెంటా డుతోంది. స్మార్ట్‌సిటీ నిధులు వచ్చే అవకాశం లేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్‌ సీఎం హామీ నిధులు సుమారు రూ.300 కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు. రెండేళ్ల నుంచి నగరపాలకసంస్థకు వచ్చిన ప్రత్యేక నిధులు దాదాపు శూన్యం. పన్నులు, ఇతరత్రా ఆదాయం ద్వారా వచ్చిన నిధులు తప్ప మరో రాబడి లేదు. జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులు, పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకే బల్దియా సాధారణ నిధులు సరిపోతున్నాయి. డివిజన్లలో చిన్న పనులు చేపట్టేందుకూ పెద్ద పైరవీలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా నగరంలో అభివృద్ధి పనుల్లో వేగం లోపించింది.

సమస్యలు బోలెడు

నగరంలో సమస్యలకు కొదవ లేదు. డంప్‌యార్డ్‌ నుంచి మొదలు, అన్ని ప్రాంతాలకు అందని తాగునీరు, ఎక్కడికక్కడ పైప్‌లైన్‌ లీకేజీలు, అస్తవ్యస్థంగా మారిన ట్రాఫిక్‌, కోతులు, కుక్కల వీరంగం, వరద వస్తే చాలు మునిగే ప్రాంతాలు, అసంపూర్తి రోడ్లు, డ్రైనేజీలు, వెలగని వీధిదీపాలు, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం, డ్రైనేజీల్లో ఏళ్లుగా ఉన్న సిల్ట్‌, స్మార్ట్‌సిటీలోనూ మట్టిరోడ్లు, శివారు, విలీన డివిజన్ల సమస్యలు అదనం. వీటన్నిటిని ప్రణాళికాబద్ధంగా పరిష్కరించడం పెద్ద సవాలే.

పాలనపై గంపెడాశలు

బీజేపీ పాలనపై సిటీ ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకొన్నారు. ఐదు లక్షల జనాభా ఉన్న నగరంలో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం, సేవలకు రూ.వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేస్థాయిలో అక్రమాలకు అవకాశముంటుంది. గతంలో బల్దియాలో చోటుచేసుకొన్న అక్రమాలపై పలువురు కార్పొరేటర్లు ఫిర్యాదు చేయడం, విజి లెన్స్‌ విచారణ, డిపార్ట్‌మెంట్‌ పరంగా విచారణలు చేపట్టడం, ఆ తరువాత ఆ విచారణలు అటకెక్కడం చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వం, అధికారులు మారినా, అక్రమాలకు పాల్పడిన వారిపై వీసమెత్తు చర్యలు లేకపోవడమే బల్దియాలో విచిత్రం.

ఒక్కసారితో పని అసాధ్యమే

ఏదైనా పనికోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఒక్కసారితో అవడమనేది అసాధ్యంగా మారింది. చిన్న పని,పెద్ద పని అనే తేడా లేకుండా పదేపదే కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం బల్దియా ఉద్యోగుల ప్రత్యేకత.కార్యాలయంలో సుళువుగా పని కావడమనేది అత్యంత కష్టతరం. ఉద్యోగులు, కొంతమంది అధికారుల్లో కొరవడిన జవాబుదారితనంతో ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. పాలనను గాడిన పెట్టాలంటే ముందు పాలనలో జవాబుదారితనాన్ని పెంచాల్సి ఉంది.

రూ.49 లక్షలతో వేసవి యాక్షన్‌ప్లాన్‌

మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ఆదివారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. మేయర్‌గా తన తొలి సంతకం వేసవి యాక్షన్‌ప్లాన్‌పై పెట్టారు. వేసవిలో నగరంలో తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు రూ.49 లక్షలతో చేపట్టబోయే పనులకు పాలనాపరమైన మంజూరు ఇచ్చారు. విలీన డివిజన్‌లైన చింతకుంట, మల్కాపూర్‌, లక్ష్మిపూర్‌, గోపాల్‌పూర్‌, దుర్శేడ్‌, బొమ్మకల్‌, కొత్తపల్లిల్లో బావులు అద్దెకు తీసుకోవడం, పైప్‌లైన్‌ వేయడం, వాల్వులు బిగించడం, ఇంటర్‌కనెక్షన్‌ ఇవ్వడం..యాక్షన్‌ప్లాన్‌లో రూపొందించారు. అందుకు అనుగుణంగా నిధులు కేటాయించారు.

– మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాన్ని సుందరంగా మారుస్తానని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడారు. నగరంలోని 66 డివిజన్లలో సదుపాయాలు కల్పించడం, సమస్యలు పరిష్కరించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. మేయర్‌గా తనకు అవకాశం కల్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర,జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీనివాస్‌ను నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, గుగ్గిళ్లపు రమేశ్‌, కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్‌రావు, వంగల పవన్‌, బండ రమణారెడ్డి, తోట అనిల్‌, తాటి ప్రభావతి, దేశ శిల్ప, పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మిప్రకాశ్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement