ఏళ్ల నిరీక్షణకు తెర | - | Sakshi
Sakshi News home page

ఏళ్ల నిరీక్షణకు తెర

Feb 23 2026 7:06 AM | Updated on Feb 23 2026 7:06 AM

ఏళ్ల నిరీక్షణకు తెర

ఏళ్ల నిరీక్షణకు తెర

● ‘గృహలక్ష్మి’ లబ్ధిదారులకు ‘ఇందిరమ్మ’ వర్తింపు ● జిల్లాలో వేలమందికి ఉపయోగం

కరీంనగర్‌ అర్బన్‌: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురునిచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకంలో నిర్మాణాలు ప్రా రంభించి నిలిచిపోయిన పనులకు ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన కొన్నేళ్లుగా మొండిగోడలు, పిల్లర్లతో దర్శనమి స్తున్న నిర్మాణాలు ఇక ఊపందుకోనున్నాయి. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల ఆర్థిక సాయం అందించేలా 2023లో అప్పటి ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. కానీ నిధుల విడుదలలో జాప్యం గుదిబండగా మారింది. అంతలోనే ప్రభుత్వం మారడంతో ఇక తమ పరిస్థితి ఏంటని లబ్ధిదారులు ఆందో ళన చెందారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.

వేల కుటుంబాలకు ప్రయోజనం

జిల్లాలో సదరు సమయంలో గృహలక్ష్మి పథకానికి 58వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. కరీంనగర్‌, హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో భారీగా అర్జీలు రాగా ఆన్‌లైన్‌ చేశారు. గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియోజకవర్గానికి 3వేల ఇళ్లను కేటాయించింది. అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి సుమారు 45వేలకు పైగా మందిని ప్రాథమికంగా అర్హులని తేల్చారు. కొందరు లబ్ధిదారులకు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యే మంజూరు పత్రాలు సైతం అందించారు. జిల్లాల్లో మూడు వేలకు పైగా అర్హులు ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకున్నారు. అనంతరం ఎన్నికల కోడ్‌ రావడం, ప్రభుత్వం మారటం, కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లకు పథకానికి శ్రీకారం చుట్టడంతో గృహలక్ష్మి లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఉన్న ఇల్లు తొలగించుకుని, ఇందిరమ్మ పథకంలో లబ్ధి పొందక నానా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయంతో భరోసా దక్కనుంది.

నిబంధనలు కఠినతరం

గృహలక్ష్మి పథకంలో నిర్మాణం నిలిచిన లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇందిరమ్మ పథకంలో నిబంధనల ప్రకారం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఉండాలి. గృహలక్ష్మి లబ్ధిదారుల బేస్‌మెంట్‌ తక్కువ ఉంటే దానిని కనీసం 400 చదరపు అడుగులకు తేవటానికి అదనపు పునాది బీమ్‌లను వేయాల్సి ఉంటుంది. పెద్దగా బేస్‌మెంట్‌ ఉంటే గరిష్ఠంగా 600 చదరపు అడుగులకు పరిమితం చేయడం తప్పనిసరి. అప్పటికే బేస్‌మెంట్‌ పూర్తయినందున ఆ దశ డబ్బులు చెల్లించరు. మిగిలిన రూ.4లక్షలు దశల వారీగా ఖాతాలో జమ చేస్తారు. రూఫ్‌ లెవల్‌ రూ.లక్ష, స్లాబ్‌ పూర్తయితే రూ.2లక్షలు, ఫినిషింగ్‌ రూ.లక్ష ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement