గద్దెకు చేరిన సారలమ్మ
● శివసత్తుల పూనకాలు ● భక్తుల కోలాహలం ● నేడు సమ్మక్క ఆగమనం
డప్పు చప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు.. ఒగ్గుడోలు నృత్యాలు.. కోయ పూజారుల మంత్రోచ్చరణల మధ్య జిల్లాలోని సమ్మక్క జాతర ప్రాంగణాల్లో బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దైపె కొలువుదీరింది. సారలమ్మ ఆగమనంతో జాతర ఘనంగా ప్రారంభమైంది. కరీంనగర్ పరిధిలోని రేకుర్తి జాతరకు ఉదయం నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు, ఈవో ఎండపల్లి మారుతి, పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఎరుకలిగుట్ట నుంచి సారలమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్టించారు. గురువారం సమ్మక్క రాకతో జాతర పులకించనుంది. ఇప్పటికే భక్తజనంతో కిక్కిరిసింది. చింతకుంటతో పాటు తొలిసారిగా మల్కాపూర్‌లో జాతర ఘనంగా జరుగుతోంది. ప్రాంగణంలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరా వినియోగిస్తున్నామని కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. కరీంనగర్ మండలం నగునూరు, ఇరుకుల్లలో సారలమ్మ గద్దైపెకి రావడంతో జాతర ప్రారంభమైంది. నగునూరు సర్పంచ్ సాయిల్ల శ్రావణి ఆధ్వర్యంలో సమ్మక్కకు బోనం సమర్పించారు. శంకరపట్నం, వేగురుపల్లి, లింగాపూర్, కొత్తపల్లితో పాటు తదితర ప్రాంతాల్లో జాతర ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. – కరీంనగర్‌కల్చరల్/కొత్తపల్లి/కరీంనగర్‌రూరల్


