కార్పొరేషన్ గెలిస్తేనే కాంగ్రెస్‌కు గౌరవం
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ కార్పొరేషన్‌ను గెలిస్తేనే కాంగ్రెస్‌కు గౌరవం దక్కుతుందని, సమన్వయంతో పనిచేయాలని పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం టికెట్‌కు దరఖాస్తు చేసుకొన్న ఆశావాహులతో నగరపాలకసంస్థ ఎన్ని కల సన్నాహక సమావేశం నగరంలోని డీసీసీ కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరీంనగర్ కార్పొరేషన్ కీలకమైనదన్నారు. అసెంబ్లీ గెలిచామని, ఎంపీ, ఉప ఎన్నికలతో పాటు పంచాయతీల్లో 70 శాతం విజయం సాధించామన్నారు. మున్సిపల్‌లోనూ గెలుస్తామని అన్నారు. ఇప్పటివరకు ఎవరికి టికెట్ ప్రకటించలేదని, సర్వే ప్రకారం పీసీసీ టికెట్లు ఇస్తుందన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచే వాళ్లనే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో ఏ వర్గం లేదని, తాను, పొన్నం,అడ్లూరి లక్ష్యం కరీంనగర్‌ను గెలవడమేనన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ టికెట్ కోసం దరఖాస్తు చేసుకొన్న ఆశావహులంతా కలిసి డివిజన్‌లో ప్రచారం చేయాలన్నారు. సర్వేల ఆధారంగా చైర్మన్ టికెట్‌లు ఇస్తారని తెలిపారు.
లాడ్జీల్లో సర్వేలు.. కరెక్ట్ కాదు
సర్వేల ఆధారంగా పార్టీటికెటట్లు ఇస్తామంటున్నారని, సర్వేలు సక్రమంగా చేయడం లేదని కార్యకర్తలు ధ్వజమెత్తారు. మంజుల మాట్లాడుతూ లాడ్జీల్లో కూర్చొని సర్వేలు చేస్తున్నారని, ఇది కరెక్టు కాదన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని, టికెట్లు ఇవ్వకపోతే పిలిచి మాట్లాడాలని అబ్దుల్‌రెహమాన్, రాంరెడ్డి, శ్రవణ్‌నాయక్, గందె కల్పన, చర్ల పద్మ తదితరులు కోరారు.
టికెట్ల ప్రకటనలపై రుసరుస
నగరంలో పార్టీ టికెట్ల ప్రకటనలపై పలువురు నేతలు రుసరుసలాడారు. టికెట్లు ఎవరిచేతిలో లేవని, అపోహలు పనికి రావని పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. కొంతమంది అనవసరంగా టికెట్లు ప్రకటిస్తుండడంతో గందరగోళం నెలకొంటోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. పీసీసీ సర్వే, ఇంటెలిజెన్స్ సర్వేల ప్రకారం టికెట్లు ఇస్తామని, ఇప్పటివరకు ఎవరికీ టికెట్ ప్రకటించలేదని డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. వెలిచాల రాజేందర్‌రావు కష్టపడుతున్నారని, అందరిని కలుపుకుపోవాలని అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి కోరారు. కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజనన్‌కుమార్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆరెపల్లి మోహన్, బొమ్మ శ్రీరాం, సిరాజ్ పాల్గొన్నారు.


