అకాడమ్మీలు!
అనుమతి లేకుండానే కోచింగ్ సెంటర్లు
అడ్డగోలుగా ఎడ్యుకేషన్ సొసైటీలు
పలు యూనివర్సిటీల పేరిట మోసం
పరీక్షల నిర్వహణ సైతం వారి చేతుల్లోనే
పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
‘మీకు కళాశాలకు వెళ్లకుండానే సర్టిఫికెట్ కావాలా? పరీక్ష రాయకుండానే డిగ్రీ పూర్తి చేయాలా? మాదగ్గరకు రండి. మీ పర్సు మాక్కావాల్సినంత బరువుగా ఉంటే చాలు పని అయిపోయినట్టే! మిగిలిందంతా మేమే చూసుకుంటాం’ అంటూ వాలిపోతారు. విద్యార్థులను, తల్లిదండ్రులను మాయమాటలతో బుట్టలో వేసుకుంటారు. చూసే వారికి అది నిజమైన కళాశాల మాదిరిగానే కనిపిస్తుంది. కానీ.. దానికి ఉన్న అనుమతులను పరిశీలిస్తే తప్ప, డొల్లతనం బయటపడదు. జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్న ఈ తరహా ‘ఎడ్యుకేషన్ మాఫియా’పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.’
కరీంనగర్‌టౌన్: ఎలాంటి అనుమతులు లేకుండా పలు యూనివర్సిటీల పేరు చెప్పుకునే అకాడమీ లు, కోచింగ్ సెంటర్లు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అడ్మిషన్ తీసుకుంటే చాలు.. అంతా తామే చూసుకుంటామని చెప్పే నిర్వాహకులు అడిగినంత సొమ్ము ఇస్తే సర్టిఫికెట్లు చేతిలో పెడతామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వెలుస్తున్న ఈ అకాడమీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి.
అనుమతి లేకుండానే..
జిల్లాలో ఎక్కడో ఒకచోట బిల్డింగ్‌ను అద్దెకు తీసుకోవడం, విద్యాశాఖ అనుమతి లేకుండా అకాడమీలు పెట్టడం.. విద్యార్థుల జీవితాలను బుగ్గిపాలు చేయడం వారిపని. ఎలాగోలా పిల్లలతో డిగ్రీ పూర్తి చేయించాలనుకునే తల్లిదండ్రులు.. కళాశాలకు వెళ్లకుండా, పరీక్షలు రాయకుండా పాసైపోవాలనుకునే యువతను టార్గెట్ చేసుకుంటారు. మరికొంత మంది పల్లెటూరి అమాయక ప్రజలను ఉచ్చులోకి లాగుతారు. రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తారు. ఇలా జిల్లాకేంద్రంతో పాటు పలు శివారు గ్రామాల్లో డిఫెన్స్ అకాడమీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.
పరీక్షల నిర్వహణ వీరి చేతుల్లోనే..
విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తమ వద్ద చేర్చుకుని, హాస్టల్ పేరిట తమవద్దే ఉంచుకుంటారు. అయితే ఆయా కళాశాలలు, హాస్టల్ నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు ఉండవు. పైకి మాత్రం ఎడ్యుకేషన్ అకాడమీలు, కోచింగ్‌సెంటర్లు, కన్సల్టెన్సీల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పరీక్షలు వీరే నిర్వహిస్తారు. పేపర్లు కూడా వీరే తయారు చేసి, తమకు ఇష్టం వచ్చిన మార్కులు వేసేస్తారు. ఒకవేళ పరీక్ష రాసేందుకు వీలుపడని వారుంటే.. వారి నుంచి ప్రత్యేకంగా నగదు తీసుకుని ‘మమ’ అనిపిస్తారు.
విద్యాశాఖ అనుమతి లేకుండానే..
జిల్లా విద్యాశాఖ అనుమతితో పాటు ప్రభుత్వ గుర్తింపు లేకుండా కరీంనగర్‌లో పదుల సంఖ్యలో కోచింగ్ కేంద్రాలు ఉన్నాయన్న విషయాన్ని జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారుల ద్వారా రహస్యంగా విద్యాశాఖ గతంలో సర్వే చేపట్టింది. దీంతో ఉన్నత విద్య, ఉద్యోగ అర్హత, ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇవ్వడానికి 12 కోచింగ్ కేంద్రాలు వెలిసినట్టుగా తేలింది. నవోదయ, కోరుకొండ, గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇచ్చే ట్యుటోరియల్స్ వివరాలు ప్రభుత్వ అనుమతి లేకుండా జిల్లాలో ఉన్నట్లు ఎంఈవోలు గుర్తించి జిల్లా విద్యాశాఖకు నివేదిక పంపారు. ఒక్క రేకుర్తి శివారులోనే అకాడమీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
మొద్దునిద్రలో విద్యాశాఖ
జిల్లాలో కోచింగ్, అకాడమీ సెంటర్ల ఏర్పాటు, అడ్మిషన్ల విషయంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన విద్యాశాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడం శోచనీయమని పలు విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా యంత్రాంగం తీరుపై పెదవి విరుస్తున్నారు. ఇకనైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లు, అకాడమీలపై విద్యాశాఖ దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.


