కేన్సర్.. నో ఫికర్
బాధితులకు ప్రభుత్వ వైద్యం
కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కేన్సర్ బాధితులకు వైద్యసేవలు మెరుగుపడ్డాయి. ఓపీ సేవలతో పాటు రోగనిర్ధారణ, కీమోథెరపీ, పాలియేటివ్‌కేర్ ద్వారా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి రెండో అంతస్తులో కేన్సర్ విభాగం ఏర్పాటు చేసి చికిత్స చేస్తూ మందులు అందిస్తున్నారు. ప్రస్తుతం కేన్సర్ కేసులు పెరుగుతుండగా.. చివరి దశ వరకు గుర్తించకపోవడం పెనుముప్పుగా మారుతోంది. దైనందిన జీవితంలో మారిన అలవాట్లు, ధూమపానం, తంబాకు, గుట్కా తదితర అలవాట్లతో జిల్లాలో కేన్సర్ వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాధి నిర్ధారణకు కావాల్సిన పరీక్షలు ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
2.90 లక్షల మంది మహిళలకు స్క్రీనింగ్
సాధారణంగా మహిళలు సర్వైకల్, రొమ్ము, ఓరల్ తదితర కేన్సర్ల బారిన పడుతుండగా, మద్యం, ధూమపానం, తంబాకు, గుట్కా తినేవారు పెద్దపేగు, నోటి కేన్సర్‌కు గురవుతున్నారు. మహిళలు కేన్సర్ బారినపడకుండా ముందస్తుగా గుర్తించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2023 మార్చి 8న ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పటి వరకు 2,90,000 మంది మహిళలను స్క్రీనింగ్ చేశారు. కేన్సర్ అనుమానితులను జనరల్ ఆసుపత్రిలో నిర్వహించే పరీక్షలకు పంపిస్తున్నారు. తద్వారా ఇప్పటి వరకు 95 మంది మహిళలకు కేన్సర్ ఉన్నట్లు గుర్తించారు. వీరంతా జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారి గణాంకాలు లేవు. ఎక్కువ మంది బ్లడ్ కేన్సర్, కాలేయ, గర్భాశయ, పెద్దపేగు, నోటి, ఊపిరితిత్తులు, మెదడు, రొమ్ము తదితర కేన్సర్ల బారిన పడుతున్నారు.
అందుబాటులోకి కీమోథెరపీ
కేన్సర్ తీవ్రత ఆధారంగా వైద్యులు కీమోఽథెరపీ, రేడియోథెరపీ చికిత్స అందిస్తారు. జిల్లాలో ఈ సేవలు ప్రైవేటు ఆసుపత్రులలో మాత్రమే ఉండేవి. గతేడాది జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి కీమోథెరపీ సేవలు అందుబాటులోకి తెచ్చారు. వ్యాధిగ్రస్తులు షెడ్యూల్ ప్రకారం కీమోథెరపీ చేయించుకుంటున్నారు. అయితే సేవలపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రత్యేక కేన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేసి రేడియోథెరపీ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తే బాధితులకు ఊరట కలగనుంది.
కేన్సర్ కేసుల వివరాలు
బ్రెస్ట్ కేన్సర్.. రెఫర్డ్ కేసులు : 347
నిర్ధారణ కేసులు : 59
ఓరల్ కేన్సర్.. రెఫర్డ్ కేసులు : 414
నిర్ధారణ కేసులు : 10
సర్వైకల్ కేన్సర్.. రెఫర్డ్ కేసులు : 247
నిర్ధారణ కేసులు : 20
ఇతర కేన్సర్ కేసులు : 06
మొత్తం కేసులు : 95
కేన్సర్.. నో ఫికర్


