ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ఎంపిక
ముస్తాబాద్(సిరిసిల్ల): ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన గండికోట రాజు ఎంపికయ్యాడు. శాతావాహన యూనివర్సిటీలో ఎంకాం సెకండియర్ చదువుతున్నాడు. శాతవాహన విశ్వవిద్యాలయం తరఫున నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటాడు. మైసూర్‌లో జరిగే సౌత్‌జోన్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
ఎర్రనర్సుపల్లి పెద్దమ్మగుడిలో చోరీ
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రహీంఖాన్‌పేట అనుబంధ గ్రామం ఎర్రనర్సుపల్లి పెద్దమ్మగుడిలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి పుస్తెమెట్టెలు రెండు జతలు ఎత్తుకెళ్లారని, హుండీ పగులగొట్టారని ముదిరాజ్ సంఘం గ్రామాధ్యక్షుడు రాగుల మహేందర్ తెలిపారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ గుడి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు.
బస్సు నుంచి జారిపడి తీవ్ర గాయాలు
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం సంకెపల్లికి చెందిన రుక్కవ్వ ఆర్టీసీ బస్సు దిగే క్రమంలో కాలు జారి కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. రెండు కాళ్లు విరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే బాధితురాలిని 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.


