శతాధిక వృద్ధురాలు మృతి | - | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధురాలు మృతి

Jan 27 2026 8:27 AM | Updated on Jan 27 2026 8:27 AM

శతాధిక వృద్ధురాలు మృతి

శతాధిక వృద్ధురాలు మృతి

ధర్మపురి: మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ రూపు సత్తమ్మ అత్తగారైన రూపు గుండమ్మ (107) ఆదివారం మృతిచెందారు. ఆమెకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారందరికీ మనుమలు, మనుమరాండ్లు ఉన్నారు. సోమవారం అంత్యక్రియలు చేయగా గ్రామస్తులు భారీగా తరలివచ్చారు.

ఐదు నెలల చిన్నారి..

మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి ఐదు నెలల చిన్నారితో దంపతులు రాగా.. పసిపాప మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఎస్సై నరేశ్‌కుమార్‌ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా వీరాపూర్‌ మండలానికి చెందిన దుర్గం శేఖర్‌ భార్య, ఇద్దరు కవలపిల్లలతో కలిసి సోమవారం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారి దర్శనానికి వచ్చారు. కోనేరులో పిల్లలకు స్నానం చేయించి, పిల్లలకు పాలు పట్టించారు. దర్శనం అనంతరం బయటకు రాగా.. ఆడశిశువులో కదలిక కనిపించలేదు. దీంతో చిన్నారిని వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తండ్రి శేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కోనేరులో చన్నీటి స్నానం చేయించడంతోపాటు పాపకు చుట్టిన టవల్‌తో ఊపిరి ఆడక చనిపోయినట్లుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

బైక్‌ ఢీకొని ఆటో బోల్తా

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ పట్టణ శివారులోని కేసీ క్యాంపు వద్ద వరంగల్‌– కరీంనగర్‌ రహదారిపై సోమవారం బైక్‌ ఢీకొని ఆటో బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో హుజురాబాద్‌ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా బైక్‌తో ఢీకొట్టిన వ్యక్తి ఆగకుండా వెళ్లిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆరు విద్యుత్‌ మోటార్లు చోరీ

జగిత్యాలరూరల్‌: జగిత్యాలఅర్బన్‌ మండలం తిప్పన్నపేట, గోపాల్‌రావుపేటలో ఆరుగురు రైతుల వ్యవసాయ మోటార్లు, ఓ రైతు ట్రాక్టర్‌ బ్యాటరీని ఆదివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. తిప్పన్నపేట, గోపాల్‌రావుపేటకు చెందిన దావ శంకర్‌, కొల్లూరి రవి, అత్తినేని గంగాధర్‌, పున్నం ప్రసాద్‌ విద్యుత్‌ మోటార్లు, కొల్లూరి రాజేశ్‌కు చెందిన ట్రాక్టర్‌ బ్యాటరీని అపహరించారు. బాధితులు సోమవారం రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు.

మద్దులపల్లిలో గుడిసె దగ్ధం

పెగడపల్లి: మండలంలోని మద్దులపల్లికి చెందిన గన్నెబోయిన శంకరమ్మ పూరి గుడిసె ప్రమాదవశాత్తు సోమవారం దగ్ధమైంది. శంకరమ్మ దీపం వెలిగించి కూలీ పనులకు వెళ్లగా మంటలు లేచి గుడిసెకు అంటుకున్నాయి. నిత్యావసర సరుకులతోపాటు వస్త్రాలు, రూ.5వేలు కాలిపోయినట్లు బాధితురాలు తెలిపింది. ఆర్‌ఐ జమున సంఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా చేశారు. స్థానిక సర్పంచ్‌ వెల్మ బలరాంరెడ్డి బాధితురాలిని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement