ఊరంతా ఒకేసారి జెండావిష్కరణ
మేడిపల్లి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ఒకే సమయానికి జెండా ఆవిష్కరించి ఆదర్శంగా నిలిచారు. ఉదయం 9 గంటలకు గ్రామంలోని అన్ని కుల, యువజన సంఘాలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ, వాణిజ్య సముదాయాల వారు ఒకేచోటకు చేరి వారివారి ఆధ్వర్యంలో ఒకే సమయానికి జండాను ఆవిష్కరించారు. సామూహికంగా జాతీయ గీతాలాపన చేశారు. గ్రామంలో సుమారు నాలుగు వేల మంది జనాభా ఉంటారు. జెండావిష్కరణ సమయంలో కొందరు అతిగా ప్రవర్తిస్తుండడంతో సర్పంచ్ యాగండ్ల సంజన ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గ్రామమంతా ఒకే సమయానికి జెండా ఆవిష్కరించాలని తీర్మానించారు. ఆమె మాటకు కట్టుబడిన గ్రామస్తులందరూ సరే అని సరిగ్గా 9 గంటలకు ఒకేసారి జెండాను ఆవిష్కరించారు.


