కదులుతున్న చెత్త గుట్ట | - | Sakshi
Sakshi News home page

కదులుతున్న చెత్త గుట్ట

Jan 26 2026 4:14 AM | Updated on Jan 26 2026 4:14 AM

కదులు

కదులుతున్న చెత్త గుట్ట

● పరిష్కారం దిశగా డంప్‌యార్డ్‌ సమస్య ● నగరపాలకసంస్థ కమిషనర్‌ కార్యాచరణ ● దీర్ఘకాలం కొనసాగితేనే ఫలితం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరానికి రాచపుండులా మారిన డంప్‌యార్డ్‌ సమస్య ఎట్టకేలకు పరిష్కారం దిశగా సాగుతోంది. ఏళ్లుగా బయోమైనింగ్‌ ప్రక్రియ ప్రహసనంగా మారిన పరిస్థితుల్లో, ఇతర ఏజెన్సీల ద్వారా చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు నగరపాలక కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా 40 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేసే పనులు కొత్తగా మొదలయ్యాయి. మొత్తం మూడు ప్లాంట్‌లతో వచ్చే జూలై నాటికి డంప్‌యార్డ్‌ సమస్య లేకుండా చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మూడున్నర లక్షల టన్నుల చెత్త

దశాబ్దాల క్రితం నగరానికి దూరంగా మానేరు ఒడ్డున డంప్‌యార్డ్‌ ఏర్పాటు చేశారు. క్రమేపీ డంప్‌యార్డ్‌ సమీపంలో కాలనీలు పుట్టుకొచ్చాయి. నగరం రోజురోజుకు విస్తరిస్తుండడంతో డంప్‌యార్డ్‌లో చెత్త కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం యార్డ్‌లో దాదాపు మూడున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోయి ఉంది. నగరం నుంచి రోజూ 140 మెట్రిక్‌టన్నుల చెత్త డంప్‌యార్డ్‌కు వచ్చి చేరుతుంది. నగరపాలకసంస్థ విస్తరించడంతో ప్రస్తుతం 160 మెట్రిక్‌ టన్నులకు చేరింది. ఇప్పటికే ఉన్న చెత్త గుట్టలు తరగకపోగా, రోజూ అదనంగా పడుతున్న చెత్తతో గుట్టలు పెద్ద సమస్యగా మారాయి.

ప్రహసనంగా బయోమైనింగ్‌

డంప్‌యార్డ్‌లో చెత్త గుట్టలుగా పేరుకుపోతుండడం సమీప కాలనీలవాసులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. కమాన్‌ ఏరియాలోని కనీసం పదిహేను డివిజన్‌ వాసులకు డంప్‌యార్డ్‌ ప్రభావం ఉంటోంది. నిత్యం మంటలు పుట్టడం, పొగ సగం నగరాన్ని కమ్మేస్తుండడంతో, డంప్‌యార్డ్‌ తొలగించాలంటూ ఏళ్లుగా ఈ ప్రాంతవాసులు ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు నిర్ణయించారు. సుమారు రూ.15 కోట్లతో 2 లక్షల మెట్రిక్‌టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు ప్రైవేట్‌ ఏజెన్సీకి కాంట్రాక్ట్‌ అప్పగించారు. మూడున్నరేళ్లు దాటుతున్నా, ఆ ఏజెన్సీ తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. పలుమార్లు ఏజెన్సీ కాంట్రాక్ట్‌ గడువు పొడగిస్తూ వచ్చారు. అయినా ఫలితం కనిపించలేదు. ఇప్పటివరకు లక్ష మెట్రిక్‌టన్నులకు పైగా చెత్తను బయోమైనింగ్‌ చేశారని చెబుతుండగా, మిగతా చెత్తను ఈ నెలాఖరులోగా బయోమైనింగ్‌ చేయాల్సి ఉంది.

30 రోజులు.. 40 వేల టన్నులు

పాత ఏజెన్సీ చెత్తను తగ్గించలేకపోవడం, తరచూ మంటలు, పొగతో ప్రజల ఇబ్బందులు పెరగడంతో నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద రూ.2 కోట్లతో 40 వేల మెట్రిక్‌టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు మరో ఏజెన్సీకి కాంట్రాక్ట్‌ అప్పగించారు. నెల రోజుల్లో 40 వేల మెట్రిక్‌టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేయాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా కాకుండా ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ యంత్రం ఒకే చోట కాకుండా, జేసీబీ తరహాలో ముందుకు వెనక్కి వెళుతుంది. గంటకు 40 నుంచి 50 టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది డీజిల్‌తో నడుస్తుంది. విద్యుత్‌ అవసరం లేదు. చెత్తను ఈ యంత్రం మూడు విధాలుగా బయోమైనింగ్‌ చేస్తుంది. బయోసాయిల్‌, ఇనర్ట్‌ (రాళ్లు, గాజుపెంకలు తదితర..), ఆర్‌డీఎఫ్‌ (ప్లాస్టిక్‌..తదితర). వీటిని వివిధ అవసరాలకు వినియోగిస్తారు. నెల రోజుల్లో 40 వేల మెట్రిక్‌టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేయగలిగితే, పనితీరు ఆధారంగా ఇదే విధానాన్ని కొనసాగించడంతో పాటు విస్తరించనున్నారు. గడువు తక్కువగా ఉండడంతో ఇలాంటి యంత్రాలను మరో రెండింటిని సమకూర్చుకోవాలని అధికారులు ఆదేశాలిచ్చారు.

ఆటంకాలు లేకుంటే సమస్య తీరినట్లే..

డంప్‌యార్డ్‌లో చెత్తను బయోమైనింగ్‌ ద్వారా తగ్గించేందుకు చేపట్టిన కార్యాచరణ, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగితే డంప్‌యార్డ్‌ సమస్య శాశ్వతంగా తీరనుంది. ప్రస్తుతం పాత ఏజెన్సీ పనులు కొనసాగుతున్నా, మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఆ లోగా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే కావడంతో, ఆ ఏజెన్సీ గడువు మరోసారి పొడగిస్తారా, చర్యలు తీసుకుంటారా చూడాలి. అలాగే కొత్తగా మొదలు పెట్టిన ఏజెన్సీ నెలరోజుల్లో తమకు అప్పగించిన లక్ష్యాన్ని చేరుకోగలిగితే, పనులను విస్తరించనున్నారు. దీంతో పాటు, కేవలం చెత్తను అప్పగిస్తే, ప్రాసెసింగ్‌ చేసుకునేందుకు కూడా పలు ఏజెన్సీలు ముందుకు వచ్చినట్లు సమాచారం. అంటే బల్దియా రూపాయి ఇవ్వకున్నా, బయోసాయిల్‌, ఇనర్ట్‌, ఆర్‌డీఎఫ్‌లను వాళ్లే తీసుకొని, చెత్తను తగ్గిస్తారన్న మాట. ఇలా మూడు ప్లాంట్‌లను ఏర్పాటు చేసి చెత్తను వేగంగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

జూలై వరకు పూర్తి చేసేలా ప్రణాళిక

డంప్‌యార్డ్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికాబద్దంగా ప్రయత్నిస్తున్నాం. జూలై నాటికి చెత్తలేకుండా చేసేందుకు కార్యాచరణ రూపొందించాం. పాత, కొత్త ఏజెన్సీతో పాటు, తాజా చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు మరో ఏజెన్సీతో చర్చిస్తున్నాం. రోజు 2 వేల మెట్రిక్‌టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేయాలని నిర్ణయించాం.

– ప్రఫుల్‌ దేశాయ్‌, నగరపాలక కమిషనర్‌

పూర్తిస్థాయిలో తొలగించాలి

నగరంలోని డంప్‌యార్డ్‌లో చెత్తను పూర్తిస్థాయిలో తొలగించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఆదివారం డంప్‌యార్డ్‌ను సందర్శించి బయోమైనింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. బయోమైనింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. కార్య క్రమంలో డీఈ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కదులుతున్న చెత్త గుట్ట1
1/2

కదులుతున్న చెత్త గుట్ట

కదులుతున్న చెత్త గుట్ట2
2/2

కదులుతున్న చెత్త గుట్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement