
కొడుకు స్ఫూర్తితో..
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్‌కు చెందిన వెంకట తిరుపతిరెడ్డి అంతర్జాతీయ సైక్లింగ్ పోటీల్లో సత్తాచాటాడు. ఇటీవల లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైక్లింగ్ (లండన్–ఎడిన్‌బర్గ్–లండన్) 1,500 కిలోమీటర్ల సైక్లింగ్‌లో కుమారుడు శ్రీహర్షరెడ్డితో కలిసి పాల్గొని తండ్రీకొడుకులు మెడల్స్ సాధించారు. సింగరేణి ఓపెన్‌కాస్టు–5లో ఈపీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిరెడ్డి 2022 మార్చి15న సైక్లింగ్ ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 45 వేల కిలోమీటర్ల మేరకు సైకిల్ మీద ప్రయాణం చేశారు. అడక్స్ ఇండియా రెండొనర్స్ నుంచి మూడుసార్లు అవార్డు సాధించారు. ఫిబ్రవరిలో కోల్ ఇండియా అథ్లెట్స్ మీట్‌లో సింగరేణి తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. జూన్ 2025లో 1,200 కిలోమీటర్లు పోటీల్లో (హైదరాబాద్–భద్రాచలం–లంబసింగి–రాజమండ్రి–హైదరాబాద్) పాల్గొని అవార్డు అందుకున్నాడు. తన కుమారుడు ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలో సైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పడంతో తనకు ఆసక్తి కలిగిందని, కుమారుడితో కలిసి లండన్ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తిరుపతిరెడ్డి తెలిపారు.