
పోరాటాల ‘గాలిపల్లి’
ఇల్లంతకుంట: పోరాటాల గ్రామంగా చరిత్రలో నిలిచిపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నిజాంపాలిత ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రానికి ఇంకా విముక్తి లభించలేదు. బద్ధం ఎల్లారెడ్డి ప్రాంతమైన గాలిపల్లి ప్రజలు నైజాం పాలనపై తిరగబడ్డారు. 1948 సెప్టెంబర్ మొదటి వారంలో రజాకార్లు గాలిపల్లికి వచ్చారు. తిరుగుబాటుదారులు వారిసైన్యంపై రాళ్లు విసిరారు. రజాకార్ల కాల్పుల్లో తిరుగుబాటుదారుల్లో ముందువరుసలో ఉన్న 11మంది చనిపోయారు. వీరిలో గాలిపల్లికి చెందిన వారు ఏడుగురు, బేగంపేట, సోమారంపేట, తాళ్లపల్లి, నర్సక్కపేట గ్రామాలకు చెందినవారు నలుగురు ఉన్నారు. రజాకార్ల పాలన నుంచి విముక్తి కలిగిన తరువాత గాలిపల్లిలో దాదాపు 20మందికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీడంఫైటర్ పింఛన్లు మంజూరు చేశాయి.