
భూ సేకరణ వేగవంతం చేయండి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 563 కోసం భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గురువారం భారత జాతీయ రహదారి సంస్థ ప్రాజెక్ట్ సంచాలకుడు దుర్గాప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, రెవెన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేశ్‌బాబుతో భూసేకరణ సమస్యలపై సమావేశం నిర్వహించారు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను గురించి చర్చించారు. ఇదివరకే పరిహారం చెల్లింపు పూర్తయిన భూమిని త్వరగా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సేకరణ విషయంలో అభ్యంతరాలు ఉన్న వారితో మాట్లాడి సహకరించేలా చూడాలని అన్నారు. భూసేకరణలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని భారత జాతీయ రహదారి సంస్థకు స్వాధీనం చేయాలని పలు సూచనలు చేశారు.