
పంద్రాగస్టుకు ముస్తాబు
కరీంనగర్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవానికి పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని ఇప్పటికే కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించగా... అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ, పరిశ్రమల, వాణిజ్యశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పతాకావిష్కరణ చేస్తారు. 9.32 గంటలకు వందన స్వీకారం, 9.40కి సందేశం, 10 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం, 10.10కు సాంస్కృతిక కార్యక్రమాలు, 10.40కు ప్రశంసపత్రాలు, మెమొంటోల ప్రదానం, 11.10 గంటలకు స్టాళ్ల పరిశీలన, 11.40కు అస్ట్రా కన్వెక్షన్ హాల్‌లో తేనీటి విందు ఉంటుంది.
కరీంనగర్ పోలీసుల లోగో మార్పు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త లోగోను ప్రతిపాదిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన లోగో రూపకల్ప నను సీపీ గౌస్ ఆలం ప్రతిపాదించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ భద్రత, శాంతిభద్రతల సంరక్షణలో నిబద్ధతను సూచించేలా ఈ లోగోను రూపొందించారు. ఈ లోగోలో హూ డేర్స్ విన్స్ అనే పదం ఉంటుంది, ఇది ధైర్యం చేసేవాడు గెలుస్తాడు అని తెలుపుతుంది. లోగోలో కనిపించే అశోక చక్రం, నాలుగు సింహాల చిహ్నం దేశభక్తిని, శక్తిని, ప్రజల్లో నిబద్ధతను ప్రతిబింబిస్తాయని సీపీ వెల్లడించారు.
‘సహకారం’ మరో ఆరు నెలలు!
కరీంనగర్ అర్బన్: ఎట్టకేలకు సహకార సంఘాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారంతో పాలకమండళ్ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలు పదవీ కాలాన్ని పొడిగించడం ఇప్పట్లో ఎన్నికలు ఉండవని స్పష్టమవుతోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్, డీసీసీబీ ఉమ్మడి జిల్లాలో 135 సంఘాలున్నాయి. ఇప్పటికే ఆరు నెలలు పదవీ కాలం పొడిగించగా తాజాగా మరో ఆరు నెలలు పొడిగించడం గమనార్హం. ఇక శుక్రవారం జరిగే పంద్రాగస్టు వేడుకల్లో చైర్మన్లే పతాకావిష్కరణ చేయనున్నారు.
విపత్తు సాయంగా జిల్లాకు రూ.కోటి
కరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయక చర్యల కోసం జిల్లాకు ముందస్తుగా రూ.కోటి విడుదల చేసింది. ఈ నెల 17 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలో కంట్రోల్ రూంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం వరదల సమయంలో ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు చర్యలు చేపట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని జిల్లా ఉన్నతాధికారులు వివరించారు.

పంద్రాగస్టుకు ముస్తాబు