కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

● చాలా చోట్ల ప్రారంభం కాని

కొనుగోళ్లు

● రోజుల తరబడి రైతుల పడిగాపులు

నిజాంసాగర్‌(జుక్కల్‌): జిల్లాలో వరి కోతలు జోరందుకున్నాయి. కొనుగోలు కేంద్రాలకు సన్న, దొడ్డు రకం ధాన్యం వస్తోంది. కానీ ఇప్పటికీ వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా కొబ్బరికాయలు కొట్టి కేంద్రాలను ప్రారంభించినా కొనుగోళ్లు ప్రారంభం కావడం లేదు.

జిల్లాలో వరి ధాన్యం సేకరణకు 418 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో 249, ఐకేపీ ఆధ్వర్యంలో 169 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం సేకరణ కోసం కోటి గన్నీబస్తాలను సివిల్‌సప్లయ్‌ అధికారులు సిద్ధం చేశారు. అయితే 5.9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సొసైటీ, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలకు హమాలీల కొరత నెలకొంది. ప్రైవేట్‌లో ధాన్యానికి గిట్టుబాటు ధర అధికంగా ఉండటంతో రైతులు ప్రైవేట్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.

వరి పంట నూర్పిడీలు జోరుగా సాగడంతో ధాన్యం కొనుగోళ్లపై వ్యాపారులు నెమ్మదించారు. పంట నూర్పిడీ చేసిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయకుండా ఆరబెట్టిన తర్వాతే తుకాలు చేస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో వరి పంటను నూర్పిడి చేస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని రైతులు ఆరబెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత తేమ శాతం 15 ఉంటేనే ప్రైవైట్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని 41 కిలోల చొప్పున తూకం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement