19 మండలాల్లో సాధారణ స్థితి..
కామారెడ్డి టౌన్ : ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. రానున్న 60 రోజుల పాటు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలు సైతం నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల, భూగర్భ జల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్–2026 వర్షపాత లోటు, క్షేత్రస్థాయి పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని జుక్కల్, పెద్దకొడప్గల్, సదాశివనగర్, మహమ్మద్నగర్లను మధ్యస్థ కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించామన్నారు.
1,500 ఎకరాల్లో నష్టం...
జిల్లాలో 3.16 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగయ్యిందని, ఇందులో 1,043 ఎకరాలు ఎండిపోయిందని కలెక్టర్ పేర్కొన్నారు. 45 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేయగా 476 ఎకరాలలో పంట దెబ్బతిన్నదన్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు పంపుసెట్లను నిరంతరం వాడుతుండడంతో సెప్టెంబర్లో విద్యుత్ వినియోగం 141.35 శాతానికి చేరిందని పేర్కొన్నారు. ఫీడర్లలో అంతరాయాలు లేకుండా చూసేందుకు 412 ట్రాన్స్ఫార్మర్లను నిల్వ ఉంచామని, 10 మరమ్మతు కేంద్రాలు, 13 వాహనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
చి‘వరి’ తడుల కోసం..
నిజాంసాగర్, పోచారం, కౌలాస్నాలా ఆయకట్టులో పంటల పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ, చివరి తడుల కోసం నిజాంసాగర్ నుంచి 1.710 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పోచారంలో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున నీటి విడుదలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
తాగునీటి కోసం ‘అత్యవసర’ చర్యలు
29.917 టీఎంసీల సామార్థ్యం గల సింగూరు జలాశయంలో ప్రస్తుతం 3.456 టీఎంసీల నీరే ఉందని కలెక్టర్ సంగ్వాన్ తెలిపారు. ఇన్ఫ్లో లేదని, తాగునీటికోసం సగటున 352 క్యూసెక్కుల ఔట్ఫ్లో కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత నిల్వలు డిసెంబర్ 15 వరకే సరిపోతాయని అంచనా వేశామన్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ. 22.59 కోట్ల అత్యవసర నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో ప్రైవేటు వ్యవసాయ బావుల అద్దె, ట్యాంకర్ల ద్వారా సరఫరా, అత్యవసర బోరుబావుల తవ్వకం పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.
సెప్టెంబర్ నాటికి జిల్లా సగటు భూగర్భ జలమట్టం 8.68 మీటర్ల లోతులో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం 25 మండలాలకుగాను 19 చోట్ల సాధారణ స్థితిలోనే భూగర్భ జలాలున్నాయన్నారు. తాడ్వాయి, డోంగ్లీ, బిచ్కుంద మండలాలు మధ్యస్థ ఒత్తిడిలో, రామారెడ్డి, రాజంపేట, నిజాంసాగర్ మండలాలు స్వల్ప ఒత్తిడిలో ఉన్నాయన్నారు. జిల్లాలోని 92,977 వ్యవసాయ బోరుబావుల్లో 1,167 బోర్లు ఎండిపోయాయన్నారు. ఇందుతో ఎల్లారెడ్డి మండలంలో 150, బీబీపేట మండలంలో 142, తాడ్వాయి మండలంలో 126 బోర్లు ఎత్తిపోయాయన్నారు. ఒత్తిడి ఉన్న మండలాల్లో భూగర్భ జలమట్టాన్ని ప్రతి వారం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మ్యాజిక్ సోక్ పిట్ల నిర్మాణంలో ఎల్లారెడ్డి, సింగూరు సెగ్మెంట్ పనుల్లో జుక్కల్, ఫాంపాండ్ల పూర్తిలో దోమకొండ మండలాలు ముందంజలో ఉన్నాయన్నారు.
జిల్లాలో నాలుగు మండలాల్లో
మధ్యస్థ కరువు
అడుగంటుతున్న ‘సింగూరు’..
డిసెంబర్ 15 వరకే తాగునీరు..
ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు
రూ. 22.59 కోట్లు మంజూరు
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ప్రజలు పొదుపు మంత్రం పఠించాలి
సమీక్ష సమావేశంలో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్


