వృథాగా మోటార్లు..
నాగిరెడ్డిపేట: ఒకప్పుడు నూతన వరి వంగడాలను ఉత్పత్తి చేస్తూ తెలంగాణలోనే అగ్రగామిగా నిలిచిన మాల్తుమ్మెద విత్తనోత్పత్తిక్షేత్రం నేడు దీనావస్థలో ఉంది. ప్రస్తుతం విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో మోటార్లు పనిచేయక భూములు బీడుగా ఉంటున్నాయి. వానాకాలం సీజన్లో 44 ఎకరాల్లో జనుము సాగు చేయాల్సి ఉండగా.. వర్షాధారంగా పది ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. సరైన వర్షాలు పడకపోవడంతో వేసిన జనుము పంట కూడా ఎండిపోతోంది.
బకాయిలు చెల్లించి.. కనెక్షన్ తొలగించి..
విత్తన క్షేత్రంలో దశాబ్ద క్రితం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటుచేసి కమర్షియల్ కనెక్షన్ను ఏర్పాటుచేశారు. పంటలు సాగు చేసినప్పుడు నెలకు రూ. 2 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు, సాగు లేని సమయంలో రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు కరెంట్ బిల్లు వచ్చేది. కానీ బిల్లులను సక్రమంగా చెల్లించకపోవడంతో సుమారు రూ.60 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఈ బిల్లును చూసి వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు అవాక్కయ్యారు. బకాయి బిల్లును చెల్లించేందుకు అవసరమైన నిధులను విడుదల చేస్తూ కరెంట్ కనెక్షన్ను వెంటనే తొలగింపజేయాలని గతేడాది డిసెంబర్లో క్షేత్రసిబ్బందిని ఆదేశించారు. బకాయిలను రెండు విడతల్లో చెల్లించిన అధికారులు.. కమర్షియల్ కనెక్షన్ను తొలగింపజేశారు.
ఫ్రీ కరెంట్ కోసం ప్రతిపాదనలు..
రైతులకు అందించినట్లుగానే విత్తన క్షేత్రానికి ఫ్రీ కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని కోరుతూ ట్రాన్స్కోకు క్షేత్ర అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇది సాంకేతిక కారణాలతో ముందుకు సాగడం లేదు. ఇటీవల సోలార్ విద్యుత్ కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఆ చర్యలూ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. కరెంటు కనెక్షన్ లేకపోవడంతో విత్తనక్షేత్రం భూములు చాలావరకు బీడుగా ఉన్నాయి. వేసిన జనుము పంట కూడా వాడిపోతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యుత్ సౌకర్యం కల్పించి, విత్తన క్షేత్రానికి పూర్వవైభవం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
విత్తనక్షేత్రం ఏర్పాటయినప్పడే క్షేత్రంలో పంటలసాగు కోసం పోచారం ప్రధానకాలువ నుంచి ఒక డిస్ట్రిబ్యూటరీని కేటాయించారు. ప్రధాన కాలువలో నీరు ప్రవహిస్తున్నన్ని రోజులు క్షేత్రానికి సాగునీరు అందుబాటులో ఉంటుంది. ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు రెండు 30 హెచ్పీ మోటార్లను ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల క్రితం ఒక మోటార్ చెడిపోయింది. ఒక్క మోటార్తోనూ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. కానీ కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో పోచారం జలాలను క్షేత్రానికి అందించలేని పరిస్థితి నెలకొంది.
మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రానికి
కరెంటు సౌకర్యం కరువు
బిల్లులు భారమై గతంలో కనెక్షన్
తీసేయించిన అధికారులు
మోటార్లు నడిచే పరిస్థితిలేక
బీడుగా వందల ఎకరాలు
పది ఎకరాలలో జనుము
సాగుకు పరిమితం
తడిలేక ఎండిపోతున్న పంట
అధికారుల తీరుపై విమర్శలు


