● నాలుగోరోజు కళ్లకు గంతలు కట్టుకుని ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
కామారెడ్డి టౌన్: ప్రభుత్వం తక్షణమే తమతో చర్చలు జరిపి డిమాండ్లను నెరవేర్చాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ అన్నారు. ఎన్హెచ్ఎం సిబ్బంది నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం చర్చలకు పిలవకపోవడం సిగ్గుచేటన్నారు. నగరంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్లో కొనసాగుతున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం అనిల్ కుమార్ సందర్శించారు. సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని, మోకాళ్లపై నిలబడి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమను క్రమబద్ధీకరణ చేయాలని, పే స్కేల్, మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు అంజయ్య, విద్యా పరిరక్షణ కమిటీ నాయకుడు శ్రీనివాస్, ఎన్హెచ్ఎం జిల్లా అధ్యక్షుడు సుమన్, గౌరవాధ్యక్షుడు మారుతి, ప్రధాన కార్యదర్శి పద్మజ, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, జేఏసీ నాయకులు వేణు, సంతోష్, మనోజ్, సాధన, మీనాక్షి, రవళి, రాహుల్, చంద్రకాంత్, అంకుశ్, సందీప్, అఖిల్, విజయ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


