రుద్రూర్: మండలంలోని అక్బర్‌నగర్ బెడ్‌రూం కాలనీలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మనోజ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. కాలనీకి చెందిన కట్టు రాహుల్ (28) కిరాణ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని రఘునాథ చెరువులో శనివారం ఉదయం ఓ వ్యక్తి పడి మృతిచెందినట్లు 5వ టౌన్ ఎస్సై సునీల్ తెలిపారు. నగరంలోని బర్కత్‌పురకు చెందిన ఇమ్రాన్(42) అనే వ్యక్తి చెరువులోకి దిగి, నీటిలో జారిపోయి మృతిచెందాడన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
బాన్సువాడ రూరల్: బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రవి శనివారం తన తొమ్మిదేళ్ల కుమార్తె రీతు జన్మదిన వేడుక నిర్వహించారు. బాలిక గన్ స్పార్కులర్ పట్టుకుని కాలుస్తుండగా ఒక్కసారిగా పేలి ఆమె ముఖంపై గాయాలయ్యాయి. బాన్సువాడ ఆస్పత్రికి బాలికను తరలించారు. తన కుమార్తెకు గాయాలు కావడంతో రవి బీర్కూరుకు వెళ్లి స్పార్కులర్ దుకాణాదారుడితో వాగ్వాదానికి దిగాడు. కాలం చెల్లిన, నాసిరకం గన్ ఇవ్వడంతోనే కుమార్తెకు గాయాలయ్యాయని ఆరోపించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బీర్కూర్ ఎస్సై రాములు తెలిపారు.
గాంధారి(ఎల్లారెడ్డి): గాంధారి అటవీ క్షేత్ర పరిధిలోని సోమారం తండా బీట్‌లో అటవీ భూమిని ఆక్రమించడానికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదైంది. శనివారం అతడిని ఎల్లారెడ్డి కోర్టులో హాజరు పరిచినట్లు ఎఫ్‌ఆర్వో రమేశ్ తెలిపారు. సోమారం తండాకు చెందిన కేతావత్ జీవన్ సోమారం తండా బీట్ పరిధి 754 కంపార్ట్‌మెంటులో అటవీ భూమిని ఆక్రమించి సాగు చేయడానికి అందులో ఉన్న చెట్లను నరికివేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిని ఎల్లారెడ్డి కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.


