రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రామస్వామిగౌడ్, శోభ దంపతులకు నలుగురు కూతుళ్లు. పెద్ద కూతురు సవిత ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఈడీ చదివింది. స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు శైలజ ఎంఎస్సీ, ఎంఈడీ చదివింది. ఎస్‌జీటీగా పనిచేస్తోంది. మూడో కూతురు స్వప్న ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఈడీ చదివింది. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు సంగీత ఎంఏ, ఎంఈడీ చదివింది. గురుకుల పాఠశాలలో పీజీటీగా పనిచేస్తోంది. నలుగురూ ఉన్నత చదువులు, ఉద్యోగాలతో స్థిరపడి కన్నవారికి సంతోషాలను పంచుతున్నారు. ‘ఆడపిల్లలు అన్న భావన లేకుండా పెంచాం. తక్కువ సంపాదనతో నలుగురిని చదివించడానికి కష్టాలు పడ్డాం. మా కష్టాలను చూసిన పిల్లలు ఇష్టంగా చదివి ఉన్నతంగా ఎదిగారు’ అని రామస్వామిగౌడ్ ఆనందం వ్యక్తం చేశారు.


