కామారెడ్డి టౌన్: ఆహార భద్రతా అధికారులు శనివారం జిల్లా కేంద్రంతోపాటు భిక్కనూర్ మండల పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి విక్రమ్ తనిఖీలు చేపట్టగా వంటశాలల్లో కనీస పరిశుభ్రత పాటించని యాజమాన్యాలతోపాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లు లేకుండా ఇష్టారాజ్యంగా ఆహార వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిని అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి అక్కడికక్కడే నోటీసులు జారీ చేశారు. వంటల్లో విచ్చలవిడిగా వాడుతున్న ప్రమాదకర సింథటిక్ ఫుడ్ కలర్లను స్వాధీనం చేసుకొని వెంటనే ధ్వంసం చేశారు. పలు హోటళ్ల నుంచి అనుమానిత ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి, పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించినట్లు విక్రమ్ తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చే నివేదికల ఆధారంగా కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.


